Labels

Showing posts with label kavithalu. Show all posts
Showing posts with label kavithalu. Show all posts

20170323

ఓఓ వారి అరేయ్  ఓరి వారి సచ్చిపోతాడ్రా ఆడు
ఈ పూట ఆ పూటో,
ఎక్కంగనో దిగంగనో,ఆయాస పడి హాటు ఫెలయ్యో,
జర్రున జారి పడి తుంట ఇరిగి,
వదులైన బండ నెత్తిమీద పడో
ఈ దినమూ ఇంకో దినమూ సచ్చేపోతడు
లాడీసు పయ్య మీదికెక్కో ,
మ్యాన్ రైడింగ్ మీదికెళ్లి జారిపడో
బొగ్గు పులుసు గాలి పీల్సి పీల్సి
ఈ ఏడో అచ్చే యేడో
సచ్చిపోతడు,
బ్లాస్టింగు కు లేచిన దుబ్బ
బొక్కల పూల్గమ్ లెక్క నింపుకొని
బోన్ మ్యారో క్యాన్సర్ తోనో ,
అర్వై ఏండ్లకో అర్వై ఒక్కేన్లకో
తిత్తులల్ల ఊపిరి ఆగాక ఉసురు దీస్తడు.
ఓ సారూ ,  సచ్చుడైతే నీవల్లనే గదా,
మరి దిగిపోయినంక సచ్చిపోతే
దిక్కుండదంటే ఎట్లా సామీ.
రెక్కల కష్టాన్ని కొడుక్కిచ్చి
రెండేండ్ల ముంగిట బాయిల దిగలేక
బయటకు దిగిపోతానన్నా
కుదరదంటే ఎట్లారా వారి ??




20151102

అఖ్లాక్

అఖ్లాక్
-----------
ఉరిసే గుడిసె లో
మాడి పోయిన బొచ్చ లో
మాంసాన్ని మాత్రం ఉడికించబోకు.
అమాంతం మనిషి మాంసాన్ని మింగేసే
రాబందులు కుర్చున్నై డిల్లీ గద్దెల మీద
న్యారేటేడ్ బై నరేంద్ర,
క్యారీడ్ అవే బై కార్యకర్తలు.
కాషాయ మోజులో కషాయ చేష్టలు
don't care bro
ఊరు చివర నుండి
మరింత దూరం విసిరేయబడ్డావ్,
ఇన్నాళ్ళు అంటరానివాడవన్నారు,
ఇప్పుడు అంటితే చంపెస్తున్నారంతే ,
డిజిటల్ ఇండియా లో మిషిన్లన్నీ
నేలను దున్నుతున్నా ,
పశుభారాన్ని మాత్రం నిన్నే మోయమంటాడు .
పెంచిన చెట్టు ఫలాన్ని కూడా తినోద్దంటాడు.
పాలిచ్చి లాలించే బర్రె మీద
ప్రేమ లేదంటావా ??
పిల్లవాడా !! దాని తోలు తెలుపు కాదుగా
మొదట ఆవు గడ్డి తిన్నాకే
నీ కంచం లో పేడ నిండుతుంది.
పెదవి విప్పడానికో,
వద్దని ముక్కు చిట్లించడానికో
నీ అవయవాలు నీదగ్గర లేవులే.
కాలే కడుపునకు కట్లు వేసి
నువ్వు కాటికి పయనమైనా పట్టించుకోరు
లౌకికత్వం మంటగలిసి
మౌకిక రాజ్యాంగం ఏలుతున్న రాజ్యం లో
మనమంతా చచ్చిన శవాలమే అఖ్లాక్.
(గో మాంసం పేరు తో హత్య గావించ బడ్డ సోదరునికి )

20150814

చెదిరిన కల

కాస్తో కూస్తో ఎదిగిన మెదల్లప్పుడు
ఎదురు పడ్డం అనుకుంటా,
అంతలోనే ఎంతలా కలిసిపోయామో ?
వెలివేయబడ్డ ఊరు
నువ్వు నడిచొచ్చిన బురద రోడ్డు
నీకు గుర్తుందా మిత్రమా ?
నీ ప్రతీ మాట గుండెల్లో పాతుకు పోయింది.
ఎన్ని కళలు కన్నాం మిత్రమా ?
ఎండిపోయిన కలేబరాలకు
ప్రాణం నింపుదామని.
ఎన్నిసార్లు కన్నీరోలికించాం మిత్రమా
కష్టాల కడలిని ఈదుకుంటూ,
నాకోసం నువ్వ్వు నీకోసం నేనని.
గుండె రగిలే కదా
ఉద్యమం లో ఉప్పెనలా దూకింది
రగిలే గుండె పగిలే కదా
మనం ప్రజల పక్షాన నిలవాలనుకున్నది
అందుకేగా ఆర్దికంగా నిలదొక్కుకొని
అందరినీ ఆదరిద్దాం అనుకున్నాం.
పై పై కి ఎగిరి పంజరం లో చిక్కిన
పక్షులను కాపాడాలనుకున్నం.
బడా భవనాలు
బహుళ జాతి కంపినీ ల మాయలు
ఆరంకెల నోట్ల కట్టలు
నోటికి కరిపించుకుని
కనిపించకుండా ఎగిరిపోయావా మిత్రమా ??
ఎదగడానికి ఎవరన్నా
చెయ్యి అందిస్తే బాగుండు అనుకునేవాళ్ళం గా ,
అప్పుడిద్దరమూ అసహయులమే
ఆ క్షణమే మొదలెట్టా
ఒక్క చెయ్యి కోసం కాదు
మనలాంటి వాళ్ళ కొసం
పదివేల చేతులు అందించడానికి
గట్టు చుట్టూ అక్షరాల విత్తనాలు నాటడాన్ని .
మిత్రమా నిజమె నువ్వన్నట్టు
చేతన్ లా ప్రేమ కథలు రాసి డబ్బు చేస్కోడం నాకు రాదు.
బొగ్గు పొరల్లో రక్తపు మరకలు అంటిన వాణ్ని కదా
తెగిన పోగు ను వెదికి ముడేసే నేను,
 తోలు డప్పు అగ్గి కపేది నువ్వు,
 కన్నీటి సాల్లల్లో కలుపు పీకిన వాళ్ళ
 చేతులు కవ్వించే కథలల్లగలవా చెప్పు.
మిత్రమా వెలివేయ బడ్డ ఊరు అట్లానే ఉంది
నడిచిన బురద రోడ్డూ ఉంది.
అక్కడ లేనిదల్లా
 ప్రవహించే రక్తంతో
 పైసల ప్రవాహంలోకొట్టుకుపోయిన
మనంమాత్రమే మిత్రమా...

20150604

దశాబ్దాల ఆవిర్భావాలు

నాకు తెలీకుండానే 
నా దేహం లో మరో ఆత్మ దాగుండేది. 
నాకు తెలీకుండానే 
నా నోరు వాని గొప్పదనాన్ని పలికెది. 
ఆ  కాలం అంతా కలల్లోనే గడిచేది. 
నన్ను నేను తెలుసుకున్నప్పుడు 
నా దేహాన్ని నేను తనివితీరా తడుముకున్నప్పుడు 
కళ్ళల్లో కరిగిన కళలకానాచినంతా
మాగానాలల్లో చల్లుదామంటే
నాకు తోడుగా ప్రపంచమంతా ప్రతిజ్ఞ పూనింది. 
పయనించే ఆరాటం లో 
ఎక్కడో ఓ అక్షరం 
మరింత బలాన్నిచ్చేది 
ఎక్కడో ఓ పిలుపు 
మరింత ఉత్సాహాన్నిచ్చేది. 
ఎక్కడో ఓ మరణం 
కన్నీటి శిలా శాసనాన్ని ముద్రించేది. 
రాజకుమారుల రాసలీలలు 
ఉద్యమ శిఖరాలను 
చిటికెలో చిదిమేసినప్పుడు 
మేఘాల్లా వచ్చిన వార్తలు 
వర్షించకుండా వెళ్ళినప్పుడు  
మనస్సేంతగా కృంగిపోయిందో ?
నిప్పు మింగి నిలువునా తగలబడి 
మహోద్యమాన్ని వెలిగిస్తున్నప్పుడు 
ఆ తల్లి పేగు ఎంతలా తన్లాడిందో?
తల లో తుపాకి గుండు పేల్చుకుని 
అమరత్వాన్ని  ఎగరేస్తూ ... కిష్టన్నా ... 
నువ్వు నేలకొరిగినప్పుడు 
ఆ పుస్తెలెంతగా గింజుకున్నయో ?
రాలిపోయిన మీ రూపాలను 
ఎన్ని  హృదయాలు దాచుకున్నాయో ?
నన్ను నన్నుగా నిలపాలని
ఎన్ని గొంతుకలు తపించాయో ?
విజయాన్ని తీరాన వదిలేసి
అలల్లో కలిసిన అమరులారా,
కరిగిపోతున్న కాల ప్రవాహం లో
దశాబ్దాల ఆవిర్భావాలు కొట్టుకుపోవచ్చుగానీ
ఈ మట్టి నేర్పిన త్యాగాలకు
అనుభవించే స్వేఛ్చా తీరాలకు
మీరే సజీవ సాక్షాలు...

20150503

ఆ అయిదు రోజులు


ఆ అయిదు రోజులు 

జారి పడని అండాల కండల్ని మేస్తూ
ఎదిగిన వాళ్ళే
పచ్చి బాలింతల రొమ్ముల్లో
పాలు తాగిన వాళ్ళంతా
ఏపుగా పెరిగి వేదవవాదాలు వాదిస్తూ 
పడదని పట్టరాదంటున్నారు .
ముట్టుడని ముట్టరాదంటున్నారు.
పొత్తి  కడుపులో భద్రంగా దాక్కుని
స్వేచ్చ గా పైకి ఎగిరినవాళ్ళే
సంకెళ్ళు వేస్తూ వేదిస్తున్నరు.
కటీ వలయపు కష్టాన్నంతా
పంటి బిగువన భరిస్తూ
రూపు దాల్చని
ఓ నిర్వీర్యపు కణాన్ని
తన్లాడుతూ తనువు నుండి
స్రావంగా వదిలేస్తే
తోడుండాల్సిన వారే
అందకారపు విశ్వాసాలు
అల్లిన కుచ్చుల్లో
పెంకాసు కుప్పలు పోసి నడిపిస్తున్నారు
సిసలు రోజుల్లో
అసలు మనిషినే కానట్టు
కాలు కదపడమే నేరంగా
మాట ఎత్తడమే
మహా పాపం అయినట్టు
పేరు చెప్పితే పరువే పోయినట్టు
మాస మాసానికి మనసుకి
మరణ శిక్షే విదిస్తారెందుకు ?
మొక్కుతున్న దేవుడైనా
రాలి పడని రక్తపు బిందువే
అది ఉత్పత్తికి మూలం అయిన
పవిత్ర హోమం అని
మీకు అర్దమయ్యేదెప్పుడు ?
ఆ అయిదు రోజుల్ని
అర్ధం చేసుకునేదేప్పుడు ?




 

20150406

ఎగిరే పతంగికి

ఈడొచ్చిందని
ఈడొచ్చి ఆడొచ్చి
జోరీగల్లా జాడవెదికి
వేదపండితుల వేదిక సాక్షిగా 
ఎగిరే పతంగికి
రెక్కలు విరిచి
నచ్చకున్నా దారపు కండెలు కట్టేసిన్లు .
బేరమాడి కొనిచ్చిన బలవంతపు బహుమానం,
నా జీవితం లోకి ప్రవేశించిన అంధకారం
నన్నడక్కుండానే నాలోకి ప్రవేశించాడు.
నిండుకున్న పాలగిలాస తో
కట్టుకున్న పునాదులు కూలిపొయ్యి
అశ్రువులు గా స్ఖలిస్తే,
ఆ కన్నీటి ఊటని చూసినప్పుడల్లా
దేహం పై గెలుపొందానన్న గర్వం
వాడి మొహం లో కొట్టోస్తుంది.
ఆ రాతి గుండెకేం తెలుసు అవి
ఓటమి లో ఒలికిన అవశేషాలని.
 చదువు కున్న పుస్తకాలన్నీ చెదలెక్కి
మట్టిలో కలిసి పొయ్యేసరికి
నెత్తుటి ముద్దలు తోడుకుంటూ
మరో శిశువు ప్రాణం పోసుకుంది.
ఇప్పుడు నేను తల్లిని మాత్రమే కాదు
ఆశల సమాధి మీద నిద్రిస్తున్న           
విధవ ను కూడా ...                           

20150218

అమర కార్మిక

వాడు దేశం కోసం
భూమి పొరలతో
కొట్లాడుతున్న సైనికుడు. 
ఒంటి చేత్తో
సముద్రాన్ని ఆపుకుంటూ,
తొంట చేత్తో
బయటకు  బొగ్గును లగేస్తున్నడు.
అంతకంతకూ కూరుకు పోయే బతుకు,
అయినా దీపం కోసం వత్తిని పేనుతనేఉన్నడు. 
ప్రతిక్షణం
ప్రకృతి తో యుద్ధం చేస్తూ,
మేలిమి బంగారాన్ని వడుకుతున్నడు.
 గంట గంట కు పెంచే
ఉత్పత్తి లక్ష్యానికి,
ఊపిరి తిత్తులను రక్షణగా నిలిపి
లోడు లాడీసు ను గుంజుతున్నడు.
నరకబడ్డ శరీర భాగాలు ,
మాంసపు ముద్దలు రుద్దుకున్న
బొగ్గు పొరలు ,
రక్తం తో పేరుకు పోయిన
భూగర్భ గనులు.
ఓ వైపు ఉబికి వచ్చే ఊటలు
హటాత్తుగా తరుముకొస్తుంటే,
ధైర్యం గా బొగ్గుపెల్లను ముద్దాడి,
నీటి ప్రవాహం లో ఆవిరై, 
అమరత్వం పొందిన వీర జవాన్లు. 
ఉత్పత్తి లో ఊపిర్లు వదిలిన 
నవ జాతి రతనాలు . 
ఈ దేశం మీకు మూడు రంగుల 
జెండా కప్పక పోవచ్చు . 
మీ వీరత్వాన్ని వినిపిస్తూ 
ఏ తుపాకి గొట్టం పేలకపోవచ్చు. 
మీ శౌర్యానికి ఏ పతకమూ 
మెడలో వాలకపోవచ్చు . 
మీ పేర్లు ఏ శిలా ఫలకం మీద 
లిఖించబడకున్నా ,
 కార్మికుల మనో ఫలకాలమీద 
ఎప్పుడూ మారుమోగుతనే ఉంటాయి. 
ఎర్ర బుగ్గలు, ఎల్ ఇ డి బల్బులు మిమ్మల్ని 
ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉంటాయి . 
నిలిచినా మీ శ్వాసలు 
పంఖల రెక్కల్లో 
మాకు ఊపిర్లు పోస్తునే ఉంటాయి . 
   -----గని ప్రమాదాల్లో అమరత్వం పొందిన కార్మికులకు ...

20150120

అమాస ...

అమాస ...
ఒక్కసారి వచ్చి పో ,
ఈ పడు వెన్నెల్లో
వెలిగే మచ్చల మొహాలను
చూడలేకున్న .
నీ నవ్వు లేని ఆ మాసపు పూటల
వెలుగుల్లో ఎంత వెలితి కన్పించిందో ?
అమాస,
నీ చీకటిని
ఇక్కడ పదిలంగా వదిలిపో,
ఎవడో అమాంతం పగలగొట్టి
వెలుగులు పారియ్యజిక్క,
ఈ దారిద్ర్యపు దాసోహాన్ని
భరించలేకున్న .
అమాస
ఇక్కడే
ఇక్కడే ఉండిపో,
మనుషుల మద్యనే
శాశ్వతంగా నిలిచిపో,
ఈ సమాజం అప్పుడప్పుడు
నిన్ను దీపాలతో చంపేయవచ్చునేమో
నాకోసమైన నువ్వు ఏమాత్రం చెదిరిపోకు. 
చచ్చు బడిన ఈ దేహపు స్పర్శ
తిరిగి పరిమలించేదాకా,
మా నయనాల ప్రాధాన్యం
నిర్వీర్యం అయ్యేదాకా ఇక్కడే దాగుండిపో. 
ఈ వస్తు వ్యామోహ ప్రపంచాన్ని
పూర్తిగా మసకబారించి పో ,
కాంతిని కామించే కుళ్ళు కళ్ళని
పూర్తిగా పూరించిపో ,
 జాతుల మద్య తారతమ్యాలను
మటుమాయం అయ్యేదాకా నిలిచిపో ,
నీతోడు
నీకు తోడుగా
నా శక్తి మేరకు
సూర్య చంద్రులతో యుద్ధం చేస్తూనే ఉంటాను .
 

20150111

ధనం ధనం

పల్లవి "     ధనం ధనం ఇది తరం తరం
                నిరంతరం ధనం ధనం
ఊటే ఉనికై , చెలిమే చెలివై , చేరువై నిలిచి                  "చరణం "        
నిచ్చెన వేసి నింగికి పాకి మేఘం నింపి
నిచ్చెన విరిగి నిలువున ముంచి చెరువే కరువై
చెలిమే చెరచి ఊటే ఇనికి పరువే తీసే                          ''పల్లవి '' 

అక్కరకు వచ్చి అప్పుగ మారి                                     "చరణం "
అరుదుగ దొరికి బిరుదుగ ఎదిగి
కొంతకు కొంతై అంతకు అంతై
ఎవరూ మోయని అసలే తీరని                                     పల్లవి

కష్టం జీతం పెడితే లాభం పోతే నష్టం                             "చరణం "
ఒకడికి కేకు ఒకరికి మేకు
ఒకరికి కాదల్ ఒకరికి కాజల్
కావల్సిందోకటేరోయ్
దగ్గరకు రాని ధనం  ధనం...                                        పల్లవి

వేటకు పూట ఆటకు ఆట                                           "చరణం "
చేతులు మారి చేష్టలు మర్చి
అందరు ఆడేదొకటే మాట  ధనం  ధనం                          పల్లవి

దొరకని దారిలో బాటలు వేసి                                         "చరణం "
బాటసారులను ఇరుకున పెట్టి
కిరికిరి చేసి కిడ్నాప్ చేసి
కంచికి చేరని కథనే ఇదిరా ధనం ధనం                          పల్లవి

జీవం లేని రెమ్మలు ఎగిరి                                            "చరణం "
నవ్వే బొమ్మలు జాతర జేరి
నంబరు కమ్మలు నమిలే ఆటర ధనం ధనం                పల్లవి 

20150107

అంబేద్కర్ గుండెల మీద

ఎన్నో ఏండ్లు గా దాచిపెట్టిన
దారిద్ర్యమది అంబేద్కర్
దళిత వర్ణానికింకా నిర్లక్ష్యపు
సోగాసులద్దుతూనే ఉన్నది
నేర్పేవాడే లేనప్పుడు
నేర్పరి కొరకు రాయితీల జాతర లెందుకోయ్ ?
బహుషా ఆనాడు సాధించిన స్వాతంత్ర్యం
వట్టి మట్టి కోసమేనేమో భీం : అందుకే
ఆ తల్లి కడుపున వాడింకా
బానిస గానే పురుడు  పోసుకున్నడు.
బహుజన స్వాతంత్ర్యానికి మరోయుద్దం
మిగిలే ఉండదని ఊహించడం మరిచావేమో ?
వెలుగులు పంచే వెన్నల కోసం ఎంత వేగంగా వెదికినా
రాలిన తారలే తారస పడుతున్నరు .
సైందవులను జయించాలని చూసిన ప్రతి సారి
నీ చూపుడు వేలు బౌద్ధాన్ని జపిస్తుంది బాబా సాహెబ్.
నువ్వు ఒరిగితే ఓదార్చిన ఆ చెట్టే
అగ్రవర్ణ హరితం తో ముసలిదై మూలుగుతంది.
ఆనాడు పెట్టిన అద్దాల వన్నె తగ్గింది బీ. ఆర్.
పాతవి మార్చి కొత్తదారి చూపవోయ్ .
అవమానపు అనుమానాలేర్పడకుండా వేసుకున్న
ఆ నల్ల కోటిప్పుడు మురుగు కంపు కొడుతుంటే
నువ్విప్పుడుండాల్సింది ఆ రహదారి గద్దెల మీద కాదు అంబేద్కర్ ,
పీతిగొద్దెల మీద బతుకులీడుస్తున్న నా తమ్ముల గుండెల మీద...    

20150101

అపర వార్తా సంజీవనీ

బడి కంటే ముందే
పోద్దటి బదిలీ పొయ్యిన అయ్య
బడి ఇడిసినంక గూడ రాకపోతే
అమ్మా నాన్నెక్కడేనంటూ
జబ్బకేసిన బ్యాగును ఇసిరేసి
  ఏమైందో ఇంత ఆల్షం ఆయే నని
బాయి కాడికి ఉరికిన
చిన్నారుల పాదాలు .
లోడాసు నెక్కరు, నెత్తిన సేఫ్టీ ల్యాంపు
చినిగిన బూట్లతో బడిపోరని లెక్క
ఆయాసం నిండిన దేహం
చెమట నిండిన బనీను
మసి నిండిన ముఖాన్ని
బట్టల సబ్బుతో పెయ్యి రుద్దుకుంటండు.
చెమర్చిన చేతులతో
మరో ప్రాణాన్ని తాకితే
గుండెల నిండిన బరువంతా
ఒక్కసారి దిగినట్టుంది.
ఈడికేందుకచ్చినవ్ రా ?
అని గద్దరించిన ఆ గద్దరింపు లో
తండ్రి రెక్కల కష్టం
పిల్లానికి తెల్వద్దనే తపన మాత్రం
గొంతులో దాగింది.
తెగిన రెక్కకి ప్రాణం ఊది పంపినట్టు
ఎగురుకుంటూ, కాలరెగిరేసుకుంటూ
నానమ్మ నాన్నత్తండే అని చెప్పిన మాట 
ఓ అమ్మ ప్రతీ రోజు వినాలనుకునే
అపర వార్తా సంజీవనీ  ...    

20141231

హాప్పీ న్యూ ఇయర్

నూతన సంవత్సరం
ఆనంద వేడుకలు
హహ్హహ్హ...
జరుపుకోండి
లెక్కించడం మరవొద్దు సుమా
సంవత్సరాన్ని నెలలనే ముక్కలుగా
వారాల చెక్కలుగా
గంటల బొక్కలను
నిమిషాల రక్తపు సుక్కలుగా
నరకండి.
గతేండ్లలో జరిగిన
మారణ హోమాలన్నింటిని
తారీఖులకతికించాలి కదా ,
ఏనాడో జరిగిన విషాద చాయలకు
అచ్చులు పోసి మరీ విలపించండి. 
జరుపుకొండి నూతన సంవత్సర వేడుకలు
ఈ క్షణికం కోసమేనేమో ,
కొన్ని వేల కన్నీటి క్షణాలను
దాటుకుంటూ వచ్చింది.
ఆకాశాన్నంటే కాంతి పుంజాలను
విసురుతూ సంబరపడండి.
జరిగిపోయిన దారుణాలను
రోజుల గోడలకు అతికించి ఆనందిద్దాం.
చితికి పోయిన గడియలను
విడమరిచి వివరిద్దాం.
పాత సంవత్సరం జరిగిన
ప్రతీ విషయాన్ని తడిమెందుకు
కొత్త క్యాలెండర్ ను ఆవిష్కరిద్దాం.
దినాల దిక్సూచి లో పొద్దులన్నీ నలుపెక్కి పోయినవే
నువ్వు నవ్వుకోడానికి అక్కడక్కడ
కొన్ని రోజులే నిర్ణయించబడ్డాయి.
నవ్వే విషయాన్ని మాత్రం
చరవాణి లో ముందే భద్రపరుచుకో
మరిచిన ఆ నవ్వు కోసం
మరెన్నిసార్లు ఏడవాల్సి వస్తుందో ?
ఈ గడియ గడిస్తే
మళ్ళీ మనం సృష్టించుకున్న
అశ్రుప్రవాహం లో
వేగంగా కొట్టుకు పోవాల్సిందే
హాప్పీ న్యూ ఇయర్ టు యు ఆల్.     

20141230

ఆశ

నా తల్లి గుండెల్లో
బంగారు ఖనిజాలున్నయని ,
నేనాడిన జాగంతా
బొగ్గు గనుల కోన అని,
గర్వంగా గొంతేత్తి అరవకముందే .
ఆఫీసులస్తయీ,
అభివృద్ధి చెందుద్ది,
కొలువులస్తే
కొంచెమన్నా కోలుకుంటం,
అచ్చురం నేర్చుకుంటే
గులిగో నలిగో కులవడి
గుమాస్తా గా నన్న పడుంటం అనకుంటే,
సర్కారు సర్వే గాళ్ళు
నా పీక సుట్టూ
కొలతల టేపు సుట్టి
నన్ను అవతలకు నెట్టిన్లు .
 ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ తో
బద్దలైన నా ఇల్లు
సరిదిద్దుకోడానికే
నా సదువంతా  అటుకెక్కింది. 
ఊరికి కొత్తగా వచ్చిన
మెర్సిడెజ్ లారీలు
తినే కంచం ల మన్ను నింపితే,
నోటి ముద్దను ఏరుకోడానికే
ఏండ్లు గడిచింది .
అప్పుడప్పుడు ఏరిగినపుడల్లా
ఎరుపచ్చినా నలుపచ్చినా
 కంపెనీ దవాఖాన్ల ఫిరీ గా
సూపిచ్చుకునే రోజత్తదనే ఆశ 
ఏ కొననో కొట్టుకుంటనే ఉన్నది.

20141224

జీహాద్ జిందాబాద్

జీహాద్ జిందాబాద్ 

ఓ పవిత్ర యుద్దమా నువ్వు కళకాలం వర్దిల్లు .
ప్రతి రోజు వినిపించే నమాజ్
ఇప్పుడు పిల్లల ఆర్తనాదాలు పఠిస్తుంది.
 అల్లాహ్ అక్బర్...  అల్లాహ్ ... 
ఒక్కడైన దేవుడికి పసి హృదయాలను
తూటాలతో గుచ్చి మాల గా వేయాలి .
అల్లాహ్ బిస్మిల్లాహ్ అక్కుబర్ ...
కరుణామయుడైన ప్రభువును
పసి మొగ్గల రక్తం తో అభిషేకించాలి .

నిండుగా నవ్వాల్సిన వార్ ముఖాలు
భయపడుతుంటే ,
నీ మనస్సు ఏమాత్రం చేలించలేక పోయిందా ?
ముద్దొచ్చే కళ్ళలో
కన్నీళ్లు తిరుగుతున్నప్పుడన్నా ,
నీ హృదయ కవాటాలు తెరుచుకోలేదా ?
గల గలా మాట్లాడాల్సిన గది లో
విద్యాకుసుమాల ఆవేదన,
నిన్ను ఒక్కసారి మనిషిగా మార్చలేకపోయిందా ?
 గురి చూసి ట్రిగ్గర్ నొక్కే ముందు ,
నీ బాల్యపు ఛాయలైనా గుర్తుకురలేదా ?

ఇప్పుడు ఇదేగా నీక్కావలసింది ?
ప్రపంచం లో మహిళలందరికీ
బుర్ఖాలు వేపిస్తా .
నా చిన్నారి హృదయాల్లో రక్తాన్ని ఎక్కించవూ ?
తర తరాల మగ జాతి కంతా
మీసాలు కత్తిరించి గడ్డాలు పెంచిస్తా .
నా బిడ్డల బుగ్గలపై నవ్వులు చిగురించనియ్యవూ ?
పదికోట్ల కంటాలతో
 నమాజ్ ని ఈ రాత్రి కల్లా చదివిస్తా ...
రేపటికల్లా తియ్యని పెదాలతో అమ్మా అని పలికించవూ ?
ప్రతి ఒక్కరిని ఈ రాత్రి కి
నీ ఉపవాస దీక్షలో పస్తులుంచుతా ...
కానీ తెలవారే సరికల్లా లేత గొంతుకలతో గిలాసడు పాలు తాగించవూ ?

ఈ క్షణానికి ప్రపంచమంతా
నీవల్ల తల దించుకుని
బాధ తో కన్నీరు కారుస్తుంది.
కానీ ,కానీ ఆ కన్నీరు కరిగి
ఆవిరి గా ఎగిరిపోయే లోపు,
పొద్దెక్కే సూర్యుని కిరణాలు
బాధని తన్నుకు పోయేలోపు
పాటశాల గది లో
పిల్లల సవ్వడి  వినిపించకపోతే,
నా పిల్లల లేత పాదాలను
నేలపై నడిపించక పోతే ,
నిన్ను నిన్ను గా అంతం చేసే
అసలైన పవిత్ర యుద్ధం మొదలైనట్టే .
జీహాద్ జిందాబాద్
ఓ పవిత్ర యుద్దమా
నువ్వు కళకాలం వర్దిల్లు. 

20141223

మత శిక్ష

మత శిక్ష

ఓం నమః శివాయ... 
హయ్యో మతమా
మా హృదయాల్లోకి ఎందుకు ప్రవహించావ్?
పరిశుద్ధ ప్రభువా ...
మాలో మనిషి తనాన్ని ఎందుకు మరిపించావ్ ?
అల్లాహ్ అక్బర్ అల్లాహ్ ...
ఈ జాతి లో దైవమనే భయాన్ని ఎందుకు నింపావ్ ?
 సహించేది లేదు
మూడ విశ్వాసాలను దులిపేసిన
 మనసును నేను
ఇక సహించేది లేదు 
నేను చీము నెత్తురు తో కోపం నిండిన
మనిషిని నేను
ఇంకస్సలె సహించేది లేదు 
ఇంకెప్పుడైనా ,
మరెప్పుడైనా ,
మతం మత్తులో
 మానవత్వాన్ని ఖాజేయ్యాలని చూస్తే
భూ గోలమంతా మహా ప్రళయం లో మండిపోని
ఆ శివునికైనా గుండు కొట్టిస్తా .
ఏ క్షణమైనా ,
మరేక్షణమైనా,
ప్రార్ధనలు ప్రాణాలను తియ్యాలని చూస్తే
శాంతి కపోతాలు రక్తం చిందించనీ
యెసుకైన మరో సారి శిలువ వేపిస్తా .
ఎక్కడైనా ,
ఇంకెక్కడైనా,
విశ్వాసం పసిపాపల శ్వాసని పీల్చెయ్యాలని చూస్తే
సైతాన్ ప్రపంచాన్ని ఆవహించనీ
అల్లాకైనా కఠిన శిక్ష విధిస్తా.

20141208

స్వేచ్చా మహిళ

స్వేచ్చా మహిళ 

నీ కనుబొమ్మల మద్యన
నిలిచిన ఎర్రని బొట్టును
చూస్తున్నప్పుడల్లా
మత పెత్తనపు హింసనే
కళ్ళల్లో కదలాడుతున్నది.
దయ చేసి ఆ బొట్టు ను తుడిపెయ్యవు.
ఆ చేతి గాజుల చప్పుడు
విన్నప్పుడల్లా
ఓ మతోన్మాది
కత్తి తో కుత్తికలను తెంపిన
అర్థ నాదాలు వినిపిస్తున్నై .
మన్నించి ఆ గాజులను పగల గొట్టవూ.
కాళ్ళ కు పట్టీలు కట్టినప్పుడల్లా
మనుషులను కులాలుగా కుట్టి
కదలకుండా వేసిన బేడీలు గా
కన్పిస్తున్నై .
క్షమించి వాటిని విప్పేయవూ.
విధవ లా ఉన్నావ్ అంటారని భయపడకు
అనేవాళ్ళంతా మత పిచ్చి పట్టిన వెదవలు.
 నువ్విప్పుడే
అసలైన స్వాతంత్ర్యం సాధించిన
స్వేచ్చా మహిళవు .       

శబ్ద శంఖం

శబ్ద శంఖం 

నా తల పై ఆకాశం లేదు
నా పాదం కింద భూమి లేదు
నేనిప్పుడు
మతానికి మానవత్వానికి మద్య
నెక్కి నెక్కి నడుస్తున్నాను .
నా కళ్లిప్పుడు
ప్రపంచాన్ని చూడట్లేదు
వెనుక జరిగిన వేదనను
ముందున్న ముదురు ఎరుపు రంగును
మాత్రమే గమనిస్తున్నది.
నా చెవులిప్పుడు
ఏ శబ్ద తరంగాలను వినట్లేదు
ఆ శబ్ద  శంఖాలను పూరించిన
కంఠాలను వెదుకుతున్నది.
నా ముక్కిప్పుడు
శ్వాసించడం లేదు
ఈ గాలి లో విష వాయువులను
నింపిన వారెవరని వెటాడుతున్నది. 

మనిషితనానికి మతానికి
జరుగుతున్న మానసిక యుద్ధం ,
ఆయుధాలు ధరించిన వాడే
ప్రతిసారి విజయం సాధిస్తున్నడు.
అయినా ఈ పాదం
పదునైన కత్తుల మీద
నెత్తురు గక్కుతుంది.
ఏదో ఒక నాడు పారిన ఈ నెత్తురే
మానవత్వం వికసించిన
రహదారి అవుతుందని. 

20141205

చెత్త పిలగాడు

చెత్త పిలగాడు 

వాడిపడేసిన మల్లె మొగ్గలు
తన స్పర్శ తో తిరిగి పరిమళిస్తాయి .
ఆ చేతి అయస్కాంత మహిమో మరేమో
విహరించె వరుకులన్నీ వాడి చెంత చేరాయి .
ఏ సాధనం లేని సౌందర్యం
 దుమ్ము తో ఆ మొహం చిగురిస్తుంది .
మనం బతికున్నంత వరకు
వాడు మనల్ని బతికించడానికే
 బతుకులీడుస్తడు .
ప్లాస్టిక్ వద్దంటూ ఫ్లెక్సీ ల్లో కన్పించే
 నినాదాలన్నీ వాడి సంచి లో నిండిపోయాయి.
మోసపోయిన ప్రియుల విరహ గీతాలు
వినిపించే విరిగిన సిమ్ములూ
చీకట్లో చల్లిన వర్షాలకు చిద్రమైన గొడుగులు
తడిచి ముద్దైనా తప్పక తొలగిస్తాడు వాడు.
చెప్పులు లేని కాళ్ళు
గూడలు తెగిన ఎంతమంది కుళ్ళును మోస్తుందో
సమయ పాలనైనా సాంఘిక పాలనైనా
వాన్ని చూసే నేర్చుకోవాలెవరైనా
ఏ కాగితము చెత్త కాదు ,
అది వాన్ని చేరాలనే చిత్తూ గా మారుతుందేమో ?

నిద్రించే ఒక రాత్రి ఆ చెత్తే వాని మెత్తని పరుపు ,
చలేసే మరోరాత్రి ఆ కవర్లే వెచ్చని దుప్పట్లు,
వానొచ్చే ఇంకోరాత్రి ఆ సంచే వాని పిట్ట గూడు,
నిద్దుర లేచి జబ్బ కేసే ఆ మూటే వాడి టెడ్డి బేర్ .
ఇప్పుడు వాడు మోస్తున్నది చెత్త బుట్ట కాదు
సమస్త జనుల పాపాల కుప్ప . 

He row in

He row  in  

తెర మీద నాజూగ్గా కన్పిచే శరీరం
తెర వెనుక ఎంత చిద్రమైందో ?
ఆట లో కత్తిరించకుండా
తన దేహాన్ని కత్తిరించుకుంటే,
ఇంచు ఇంచు కు రేటు కట్టి ,
అంగాంగాన్ని ఆస్తులుగా అమ్ముకునే  నిర్మాత.
తన  దేహం ఒక మర్రి చెట్టు .
వాలిపోయే ప్రతీ మగాడు
తన దృష్టి లో పిట్ట రెట్టే ,
వాసనా మత్తులో మునిగి
లొట్టలేసుకుంటూ చూసేదే వీక్షకులు.

క్లాప్ కి ముందు ప్రతి వాని
పక్క చేరితే గానీ
కథకు కథానాయిక కాలేని తను
మనకు తెరపై కన్పించేది
తనువు మాత్రమే ,
మేకప్ వేస్కునే ప్రతీసారీ
మనసుకు మత్తు మందిస్తుంది.
ఇరువైనాలుగు రాత్రుల్లో
రక్కిన గాయాలు కన్పించకుండా
కాస్మోటిక్స్ తో ముఖానికి నవ్వు ను
అతికించుకున్నది హీరోయిన్ కాదు
he row  in  

20141201

కుష్టు రోగం

అతి పెద్ద ప్రజాస్వామ్యం లో
పార్టీలన్నీ చేతులు కల్పాయి
దేశాన్నెలా దోచుకోవాలా అని.
ఓటేస్న పోటు గాన్ని పట్టి మరీ
చూపుడు వేలుకు చుక్కనంటిచ్చారు.

వేస్న ఓటు గెల్చినోడ్కి దాసోహం అయ్యింది ,
అంటిన చుక్క అంతకంతకు పెరిగి
కుష్టు రోగం అయింది.

కార్పోరేట్ గద్దలన్నీ
పిక్కల్లో మాంసాన్ని పీక్కుతిన్నా
చచ్చు బడిన శరీరానికేం తెలుస్తుంది.

గుండెల్లో గునపాల్ని దించి
రక్తాన్ని పిండేస్తు , కాషాయాన్ని  ఎక్కిస్తున్నా
ఈ కళ్ళింకా భ్రమ పడుతున్నాయ్ వ్యాధి
తగ్గించే వ్యాక్సిన్ అని .