20131118

మళ్ళీ అడుగు

కలిసి మెలిసి ఆడిన పదాలన్నీ
మీతో కలిసి పరిగెత్త లేక
అలిసి ఎక్కడెక్కడో జారి పడ్డాయి .
ఇంకొన్ని మీ కాళ్ళ సందుల్లోనే పడి
కోన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి .

గమ్యం లేని మీ పరుగుల ప్రయాణం లో,
మీకెరుక లేకుండానే ఎన్నో తరాలు మారాయి.
తరానికీ తరానికీ మద్య ఎన్నో అంతరాలు,
ప్రతీ తరం తెలియకుండా దాచిన అంతరంగాలు.

ఇన్ని రంగాల్లో ఆరితేరిన మీరు
మా తరాలను ఎన్నడో మరిచే ఉంటారు .

మీ లాంటి వాళ్ళకొరకే స్వరాష్ట్రం
ఒక వజ్రాయుధమై వచ్చింది .

మేల్కోండి ,
ఒక్కసారి నిన్నటి రాత్రుల్లో
దాగిన చీకట్లని చీల్చి,
తరాల వెలుతురును ధరించండి .

మీ తాత ల నోట్లో ఆడిన ఆణిముత్యాల
అవశేషాల్ అస్థికల్ అదిగో అవే
కన్పిస్తున్నయా ??

మరెన్నో పదాలు అస్తిపంజరాలై
వేలాడుతున్నై , గమనించండి .

మీ ఇంటి మూలల్లో పట్టిన
పరాయి బూజును చూసి
మురిసిపోతున్నారా ?

పగిలిన మీ ముఖాలను
దుమ్ము పట్టిన అద్దం లో చూస్తూ
అందగాళ్ళని ఆనంద పడుతున్నారా ?
హహ్హహ్హః

ఈ రాష్ట్ర వెలుగులు బహుషా
మిమ్మల్ని తాకలేదేమో ఇంకా ?

ఆ బూజును దులిపి
మే ముని వేళ్ళ తో ఆ అద్దాన్ని తాకండి .
ఆ వేళి ముద్రల్లో అసలు నిజాలు కన్పిస్తై .

ఇగో ఇక్కడే దశాబ్దాలు గా
ఎలుగని లాంతరు
మూలాన మొలకు వేలాడుతుంది .
మంత్రాలూ తెలిస్తే అది
అల్లావుద్దిన్  అద్భుతదీపం .
మీ పొడి చేతులతో దాన్ని నిమిరి
వత్తిని వెలిగించండి .
ఆ వెలుగు లో మీకు చారిత్రిక
ఆనవాళ్ళు అగుపిస్తాయి .

ఇక పదండి
తొంట చేతిలో లాంతరు
కుడి చేతిలో వజ్రాయుధం తో
నా తో రండి .
మిమ్మల్ని స్వరాష్ట్ర
స్వేచ్చా తీరాలకు చేరుస్తా .