20141231

హాప్పీ న్యూ ఇయర్

నూతన సంవత్సరం
ఆనంద వేడుకలు
హహ్హహ్హ...
జరుపుకోండి
లెక్కించడం మరవొద్దు సుమా
సంవత్సరాన్ని నెలలనే ముక్కలుగా
వారాల చెక్కలుగా
గంటల బొక్కలను
నిమిషాల రక్తపు సుక్కలుగా
నరకండి.
గతేండ్లలో జరిగిన
మారణ హోమాలన్నింటిని
తారీఖులకతికించాలి కదా ,
ఏనాడో జరిగిన విషాద చాయలకు
అచ్చులు పోసి మరీ విలపించండి. 
జరుపుకొండి నూతన సంవత్సర వేడుకలు
ఈ క్షణికం కోసమేనేమో ,
కొన్ని వేల కన్నీటి క్షణాలను
దాటుకుంటూ వచ్చింది.
ఆకాశాన్నంటే కాంతి పుంజాలను
విసురుతూ సంబరపడండి.
జరిగిపోయిన దారుణాలను
రోజుల గోడలకు అతికించి ఆనందిద్దాం.
చితికి పోయిన గడియలను
విడమరిచి వివరిద్దాం.
పాత సంవత్సరం జరిగిన
ప్రతీ విషయాన్ని తడిమెందుకు
కొత్త క్యాలెండర్ ను ఆవిష్కరిద్దాం.
దినాల దిక్సూచి లో పొద్దులన్నీ నలుపెక్కి పోయినవే
నువ్వు నవ్వుకోడానికి అక్కడక్కడ
కొన్ని రోజులే నిర్ణయించబడ్డాయి.
నవ్వే విషయాన్ని మాత్రం
చరవాణి లో ముందే భద్రపరుచుకో
మరిచిన ఆ నవ్వు కోసం
మరెన్నిసార్లు ఏడవాల్సి వస్తుందో ?
ఈ గడియ గడిస్తే
మళ్ళీ మనం సృష్టించుకున్న
అశ్రుప్రవాహం లో
వేగంగా కొట్టుకు పోవాల్సిందే
హాప్పీ న్యూ ఇయర్ టు యు ఆల్.     

20141230

ఆశ

నా తల్లి గుండెల్లో
బంగారు ఖనిజాలున్నయని ,
నేనాడిన జాగంతా
బొగ్గు గనుల కోన అని,
గర్వంగా గొంతేత్తి అరవకముందే .
ఆఫీసులస్తయీ,
అభివృద్ధి చెందుద్ది,
కొలువులస్తే
కొంచెమన్నా కోలుకుంటం,
అచ్చురం నేర్చుకుంటే
గులిగో నలిగో కులవడి
గుమాస్తా గా నన్న పడుంటం అనకుంటే,
సర్కారు సర్వే గాళ్ళు
నా పీక సుట్టూ
కొలతల టేపు సుట్టి
నన్ను అవతలకు నెట్టిన్లు .
 ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ తో
బద్దలైన నా ఇల్లు
సరిదిద్దుకోడానికే
నా సదువంతా  అటుకెక్కింది. 
ఊరికి కొత్తగా వచ్చిన
మెర్సిడెజ్ లారీలు
తినే కంచం ల మన్ను నింపితే,
నోటి ముద్దను ఏరుకోడానికే
ఏండ్లు గడిచింది .
అప్పుడప్పుడు ఏరిగినపుడల్లా
ఎరుపచ్చినా నలుపచ్చినా
 కంపెనీ దవాఖాన్ల ఫిరీ గా
సూపిచ్చుకునే రోజత్తదనే ఆశ 
ఏ కొననో కొట్టుకుంటనే ఉన్నది.

20141224

జీహాద్ జిందాబాద్

జీహాద్ జిందాబాద్ 

ఓ పవిత్ర యుద్దమా నువ్వు కళకాలం వర్దిల్లు .
ప్రతి రోజు వినిపించే నమాజ్
ఇప్పుడు పిల్లల ఆర్తనాదాలు పఠిస్తుంది.
 అల్లాహ్ అక్బర్...  అల్లాహ్ ... 
ఒక్కడైన దేవుడికి పసి హృదయాలను
తూటాలతో గుచ్చి మాల గా వేయాలి .
అల్లాహ్ బిస్మిల్లాహ్ అక్కుబర్ ...
కరుణామయుడైన ప్రభువును
పసి మొగ్గల రక్తం తో అభిషేకించాలి .

నిండుగా నవ్వాల్సిన వార్ ముఖాలు
భయపడుతుంటే ,
నీ మనస్సు ఏమాత్రం చేలించలేక పోయిందా ?
ముద్దొచ్చే కళ్ళలో
కన్నీళ్లు తిరుగుతున్నప్పుడన్నా ,
నీ హృదయ కవాటాలు తెరుచుకోలేదా ?
గల గలా మాట్లాడాల్సిన గది లో
విద్యాకుసుమాల ఆవేదన,
నిన్ను ఒక్కసారి మనిషిగా మార్చలేకపోయిందా ?
 గురి చూసి ట్రిగ్గర్ నొక్కే ముందు ,
నీ బాల్యపు ఛాయలైనా గుర్తుకురలేదా ?

ఇప్పుడు ఇదేగా నీక్కావలసింది ?
ప్రపంచం లో మహిళలందరికీ
బుర్ఖాలు వేపిస్తా .
నా చిన్నారి హృదయాల్లో రక్తాన్ని ఎక్కించవూ ?
తర తరాల మగ జాతి కంతా
మీసాలు కత్తిరించి గడ్డాలు పెంచిస్తా .
నా బిడ్డల బుగ్గలపై నవ్వులు చిగురించనియ్యవూ ?
పదికోట్ల కంటాలతో
 నమాజ్ ని ఈ రాత్రి కల్లా చదివిస్తా ...
రేపటికల్లా తియ్యని పెదాలతో అమ్మా అని పలికించవూ ?
ప్రతి ఒక్కరిని ఈ రాత్రి కి
నీ ఉపవాస దీక్షలో పస్తులుంచుతా ...
కానీ తెలవారే సరికల్లా లేత గొంతుకలతో గిలాసడు పాలు తాగించవూ ?

ఈ క్షణానికి ప్రపంచమంతా
నీవల్ల తల దించుకుని
బాధ తో కన్నీరు కారుస్తుంది.
కానీ ,కానీ ఆ కన్నీరు కరిగి
ఆవిరి గా ఎగిరిపోయే లోపు,
పొద్దెక్కే సూర్యుని కిరణాలు
బాధని తన్నుకు పోయేలోపు
పాటశాల గది లో
పిల్లల సవ్వడి  వినిపించకపోతే,
నా పిల్లల లేత పాదాలను
నేలపై నడిపించక పోతే ,
నిన్ను నిన్ను గా అంతం చేసే
అసలైన పవిత్ర యుద్ధం మొదలైనట్టే .
జీహాద్ జిందాబాద్
ఓ పవిత్ర యుద్దమా
నువ్వు కళకాలం వర్దిల్లు. 

20141223

మత శిక్ష

మత శిక్ష

ఓం నమః శివాయ... 
హయ్యో మతమా
మా హృదయాల్లోకి ఎందుకు ప్రవహించావ్?
పరిశుద్ధ ప్రభువా ...
మాలో మనిషి తనాన్ని ఎందుకు మరిపించావ్ ?
అల్లాహ్ అక్బర్ అల్లాహ్ ...
ఈ జాతి లో దైవమనే భయాన్ని ఎందుకు నింపావ్ ?
 సహించేది లేదు
మూడ విశ్వాసాలను దులిపేసిన
 మనసును నేను
ఇక సహించేది లేదు 
నేను చీము నెత్తురు తో కోపం నిండిన
మనిషిని నేను
ఇంకస్సలె సహించేది లేదు 
ఇంకెప్పుడైనా ,
మరెప్పుడైనా ,
మతం మత్తులో
 మానవత్వాన్ని ఖాజేయ్యాలని చూస్తే
భూ గోలమంతా మహా ప్రళయం లో మండిపోని
ఆ శివునికైనా గుండు కొట్టిస్తా .
ఏ క్షణమైనా ,
మరేక్షణమైనా,
ప్రార్ధనలు ప్రాణాలను తియ్యాలని చూస్తే
శాంతి కపోతాలు రక్తం చిందించనీ
యెసుకైన మరో సారి శిలువ వేపిస్తా .
ఎక్కడైనా ,
ఇంకెక్కడైనా,
విశ్వాసం పసిపాపల శ్వాసని పీల్చెయ్యాలని చూస్తే
సైతాన్ ప్రపంచాన్ని ఆవహించనీ
అల్లాకైనా కఠిన శిక్ష విధిస్తా.

20141208

స్వేచ్చా మహిళ

స్వేచ్చా మహిళ 

నీ కనుబొమ్మల మద్యన
నిలిచిన ఎర్రని బొట్టును
చూస్తున్నప్పుడల్లా
మత పెత్తనపు హింసనే
కళ్ళల్లో కదలాడుతున్నది.
దయ చేసి ఆ బొట్టు ను తుడిపెయ్యవు.
ఆ చేతి గాజుల చప్పుడు
విన్నప్పుడల్లా
ఓ మతోన్మాది
కత్తి తో కుత్తికలను తెంపిన
అర్థ నాదాలు వినిపిస్తున్నై .
మన్నించి ఆ గాజులను పగల గొట్టవూ.
కాళ్ళ కు పట్టీలు కట్టినప్పుడల్లా
మనుషులను కులాలుగా కుట్టి
కదలకుండా వేసిన బేడీలు గా
కన్పిస్తున్నై .
క్షమించి వాటిని విప్పేయవూ.
విధవ లా ఉన్నావ్ అంటారని భయపడకు
అనేవాళ్ళంతా మత పిచ్చి పట్టిన వెదవలు.
 నువ్విప్పుడే
అసలైన స్వాతంత్ర్యం సాధించిన
స్వేచ్చా మహిళవు .       

శబ్ద శంఖం

శబ్ద శంఖం 

నా తల పై ఆకాశం లేదు
నా పాదం కింద భూమి లేదు
నేనిప్పుడు
మతానికి మానవత్వానికి మద్య
నెక్కి నెక్కి నడుస్తున్నాను .
నా కళ్లిప్పుడు
ప్రపంచాన్ని చూడట్లేదు
వెనుక జరిగిన వేదనను
ముందున్న ముదురు ఎరుపు రంగును
మాత్రమే గమనిస్తున్నది.
నా చెవులిప్పుడు
ఏ శబ్ద తరంగాలను వినట్లేదు
ఆ శబ్ద  శంఖాలను పూరించిన
కంఠాలను వెదుకుతున్నది.
నా ముక్కిప్పుడు
శ్వాసించడం లేదు
ఈ గాలి లో విష వాయువులను
నింపిన వారెవరని వెటాడుతున్నది. 

మనిషితనానికి మతానికి
జరుగుతున్న మానసిక యుద్ధం ,
ఆయుధాలు ధరించిన వాడే
ప్రతిసారి విజయం సాధిస్తున్నడు.
అయినా ఈ పాదం
పదునైన కత్తుల మీద
నెత్తురు గక్కుతుంది.
ఏదో ఒక నాడు పారిన ఈ నెత్తురే
మానవత్వం వికసించిన
రహదారి అవుతుందని. 

20141205

చెత్త పిలగాడు

చెత్త పిలగాడు 

వాడిపడేసిన మల్లె మొగ్గలు
తన స్పర్శ తో తిరిగి పరిమళిస్తాయి .
ఆ చేతి అయస్కాంత మహిమో మరేమో
విహరించె వరుకులన్నీ వాడి చెంత చేరాయి .
ఏ సాధనం లేని సౌందర్యం
 దుమ్ము తో ఆ మొహం చిగురిస్తుంది .
మనం బతికున్నంత వరకు
వాడు మనల్ని బతికించడానికే
 బతుకులీడుస్తడు .
ప్లాస్టిక్ వద్దంటూ ఫ్లెక్సీ ల్లో కన్పించే
 నినాదాలన్నీ వాడి సంచి లో నిండిపోయాయి.
మోసపోయిన ప్రియుల విరహ గీతాలు
వినిపించే విరిగిన సిమ్ములూ
చీకట్లో చల్లిన వర్షాలకు చిద్రమైన గొడుగులు
తడిచి ముద్దైనా తప్పక తొలగిస్తాడు వాడు.
చెప్పులు లేని కాళ్ళు
గూడలు తెగిన ఎంతమంది కుళ్ళును మోస్తుందో
సమయ పాలనైనా సాంఘిక పాలనైనా
వాన్ని చూసే నేర్చుకోవాలెవరైనా
ఏ కాగితము చెత్త కాదు ,
అది వాన్ని చేరాలనే చిత్తూ గా మారుతుందేమో ?

నిద్రించే ఒక రాత్రి ఆ చెత్తే వాని మెత్తని పరుపు ,
చలేసే మరోరాత్రి ఆ కవర్లే వెచ్చని దుప్పట్లు,
వానొచ్చే ఇంకోరాత్రి ఆ సంచే వాని పిట్ట గూడు,
నిద్దుర లేచి జబ్బ కేసే ఆ మూటే వాడి టెడ్డి బేర్ .
ఇప్పుడు వాడు మోస్తున్నది చెత్త బుట్ట కాదు
సమస్త జనుల పాపాల కుప్ప . 

He row in

He row  in  

తెర మీద నాజూగ్గా కన్పిచే శరీరం
తెర వెనుక ఎంత చిద్రమైందో ?
ఆట లో కత్తిరించకుండా
తన దేహాన్ని కత్తిరించుకుంటే,
ఇంచు ఇంచు కు రేటు కట్టి ,
అంగాంగాన్ని ఆస్తులుగా అమ్ముకునే  నిర్మాత.
తన  దేహం ఒక మర్రి చెట్టు .
వాలిపోయే ప్రతీ మగాడు
తన దృష్టి లో పిట్ట రెట్టే ,
వాసనా మత్తులో మునిగి
లొట్టలేసుకుంటూ చూసేదే వీక్షకులు.

క్లాప్ కి ముందు ప్రతి వాని
పక్క చేరితే గానీ
కథకు కథానాయిక కాలేని తను
మనకు తెరపై కన్పించేది
తనువు మాత్రమే ,
మేకప్ వేస్కునే ప్రతీసారీ
మనసుకు మత్తు మందిస్తుంది.
ఇరువైనాలుగు రాత్రుల్లో
రక్కిన గాయాలు కన్పించకుండా
కాస్మోటిక్స్ తో ముఖానికి నవ్వు ను
అతికించుకున్నది హీరోయిన్ కాదు
he row  in  

20141201

కుష్టు రోగం

అతి పెద్ద ప్రజాస్వామ్యం లో
పార్టీలన్నీ చేతులు కల్పాయి
దేశాన్నెలా దోచుకోవాలా అని.
ఓటేస్న పోటు గాన్ని పట్టి మరీ
చూపుడు వేలుకు చుక్కనంటిచ్చారు.

వేస్న ఓటు గెల్చినోడ్కి దాసోహం అయ్యింది ,
అంటిన చుక్క అంతకంతకు పెరిగి
కుష్టు రోగం అయింది.

కార్పోరేట్ గద్దలన్నీ
పిక్కల్లో మాంసాన్ని పీక్కుతిన్నా
చచ్చు బడిన శరీరానికేం తెలుస్తుంది.

గుండెల్లో గునపాల్ని దించి
రక్తాన్ని పిండేస్తు , కాషాయాన్ని  ఎక్కిస్తున్నా
ఈ కళ్ళింకా భ్రమ పడుతున్నాయ్ వ్యాధి
తగ్గించే వ్యాక్సిన్ అని .  

20141127

వెలిగించడం కోసమే

వెలిగించడం కోసమే 

మదమెక్కిన అధికారం
మానవత్వాన్ని అవమానిస్తూనే ఉంటుంది .
మరచిపోయి , సమాజం తో కలసి పోడానికది
పీడ కళైనా బాగుండు ,
పారిపోయి ప్రాణాలైనా కాపాడుకోడానికది
ఒకసారి జర్గే దాడైనా కాదే ?
అడుగు అడుగు కు
తారస పడే కళ్ళకు పట్టిన పచ్చ కామెర్లు .

అధికారపు అంధకారాన్ని
పటాపంచెలు చెయ్యటానికి
ప్రతీ అవమానం ఎక్కడో ఒకచోట
ఆడవి పువ్వులను వెదుకుతూనే ఉంటది,
 ఓ కథకుడు కర్శకుడిలా
ఆ కర్మాగారం లో పువ్వు పువ్వునీ జత చేస్తూనే ఉంటాడు,
ఓ పరిశోధకుడు శ్రామికుడిలా
ఆధునిక వంగడాలను పాత్రల్లో పూరిస్తుంటాడు .
నల్లమల కిరీటాలు ధరించిన అగ్గిపుల్లలు
ఏ క్షణాన నీరసపడవు , నిరుత్సాహపడవు .
ఒక్క తూటా తో నేలకొరిగిన దేహాలాన్నిటికీ తెలుసు
తాము వెలగడం కోసం కాదు , వెలిగించడం కోసమే అని.