20141205

చెత్త పిలగాడు

చెత్త పిలగాడు 

వాడిపడేసిన మల్లె మొగ్గలు
తన స్పర్శ తో తిరిగి పరిమళిస్తాయి .
ఆ చేతి అయస్కాంత మహిమో మరేమో
విహరించె వరుకులన్నీ వాడి చెంత చేరాయి .
ఏ సాధనం లేని సౌందర్యం
 దుమ్ము తో ఆ మొహం చిగురిస్తుంది .
మనం బతికున్నంత వరకు
వాడు మనల్ని బతికించడానికే
 బతుకులీడుస్తడు .
ప్లాస్టిక్ వద్దంటూ ఫ్లెక్సీ ల్లో కన్పించే
 నినాదాలన్నీ వాడి సంచి లో నిండిపోయాయి.
మోసపోయిన ప్రియుల విరహ గీతాలు
వినిపించే విరిగిన సిమ్ములూ
చీకట్లో చల్లిన వర్షాలకు చిద్రమైన గొడుగులు
తడిచి ముద్దైనా తప్పక తొలగిస్తాడు వాడు.
చెప్పులు లేని కాళ్ళు
గూడలు తెగిన ఎంతమంది కుళ్ళును మోస్తుందో
సమయ పాలనైనా సాంఘిక పాలనైనా
వాన్ని చూసే నేర్చుకోవాలెవరైనా
ఏ కాగితము చెత్త కాదు ,
అది వాన్ని చేరాలనే చిత్తూ గా మారుతుందేమో ?

నిద్రించే ఒక రాత్రి ఆ చెత్తే వాని మెత్తని పరుపు ,
చలేసే మరోరాత్రి ఆ కవర్లే వెచ్చని దుప్పట్లు,
వానొచ్చే ఇంకోరాత్రి ఆ సంచే వాని పిట్ట గూడు,
నిద్దుర లేచి జబ్బ కేసే ఆ మూటే వాడి టెడ్డి బేర్ .
ఇప్పుడు వాడు మోస్తున్నది చెత్త బుట్ట కాదు
సమస్త జనుల పాపాల కుప్ప . 

No comments:

Post a Comment