20150406

ఎగిరే పతంగికి

ఈడొచ్చిందని
ఈడొచ్చి ఆడొచ్చి
జోరీగల్లా జాడవెదికి
వేదపండితుల వేదిక సాక్షిగా 
ఎగిరే పతంగికి
రెక్కలు విరిచి
నచ్చకున్నా దారపు కండెలు కట్టేసిన్లు .
బేరమాడి కొనిచ్చిన బలవంతపు బహుమానం,
నా జీవితం లోకి ప్రవేశించిన అంధకారం
నన్నడక్కుండానే నాలోకి ప్రవేశించాడు.
నిండుకున్న పాలగిలాస తో
కట్టుకున్న పునాదులు కూలిపొయ్యి
అశ్రువులు గా స్ఖలిస్తే,
ఆ కన్నీటి ఊటని చూసినప్పుడల్లా
దేహం పై గెలుపొందానన్న గర్వం
వాడి మొహం లో కొట్టోస్తుంది.
ఆ రాతి గుండెకేం తెలుసు అవి
ఓటమి లో ఒలికిన అవశేషాలని.
 చదువు కున్న పుస్తకాలన్నీ చెదలెక్కి
మట్టిలో కలిసి పొయ్యేసరికి
నెత్తుటి ముద్దలు తోడుకుంటూ
మరో శిశువు ప్రాణం పోసుకుంది.
ఇప్పుడు నేను తల్లిని మాత్రమే కాదు
ఆశల సమాధి మీద నిద్రిస్తున్న           
విధవ ను కూడా ...