20170315

పోరాటం

అనగనగా మొన్నట్లోనే ఒక మహా కీకారణ్యం ఉండేది. అందులో కొన్ని సింహాలు పులులు సంఘటితం అయ్యి ఆ అడవిలోని జంతువులని తినడం మొదలెట్టాయి. వాటి దెబ్బకి ఆ అడవి లోని జంతువులన్నీ పక్క ప్రాంతాలకు వలసవెల్ల సాగాయి. కానీ ఆ అడవినే నమ్ముకుని ప్రేమ పెంచుకుని బతుకుతున్న కొన్ని జంతువులు పక్షులకి ఏం చెయ్యాలో తోచలేదు. మొదట ఆ అడవులో తెలివి గల నక్క మరో నక్కని ప్రేరేపించింది మనం తిరగబడాలని, దానికి మరో నక్క  మనం సింహాలం కాదు కదా కనీసం పులులం కూడా కాదు, మనం తిరగబడితే మన ప్రాణాలకే ముప్పు అని చెప్పింది. అప్పుడు ఆ రెండు నక్కలు కలిసి ఒక పెద్ద ఉపాయం వేసాయి. అడవి లో ఉన్న అన్ని ప్రాణులని ఏకం చెయ్యాలని నిర్ణయించుకున్నాయి. రోజు అర్దరాత్రి సమావేశం కా సాగాయి. కానీ వాటన్నింటిది  వేరే జాతి, నాయకుణ్ణి ఎవర్ని పెట్టాలన్నా గొడవే, మా జాతి వాడే నాయకుడు కావాలంటే లేదు లేదు మా జాతి వాడే కావాలని. ఎప్పుడు ఒక్క నిర్ణయానికి రాలేక సమావేశం అర్దాంతరంగా ముగిసేది. కాని ఆ నక్కలకి ఆశ చావలేదు, ఏదో ఒక నాడు ఈ అడవిని దక్కించుకోవాలన్న దృడ నిచ్చయం వాటిని నిద్రపోనివ్వలేదు. ఇంకో సమావేశం లో ఆ రెండు నక్కలు ఒక ఉపాయాన్ని ముందు పెట్టాయి. మనలో ఒకర్ని ఎన్నుకుంటే వాడు నా వాడే కావాలని గొడవపడుతున్నాం కదా, అలా కాకుండా మనం ఒక సింహాన్ని మచ్చిక చేసుకుని మన ఈ పోరాటానికి నాయకుని గా చేసి అందరిని ఒకే తాటి మీదకు తెచ్చి పోరాటాన్ని సాగించాలి అని. దానికి మొదట అడవి పందులు వ్యతిరేకించినా తప్పని పరిస్తుతుల్లో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఒప్పుకున్నారు. మెల్లిగా ఒక సింహానికి ఎలకల్ని ఎరగా వేసి మచ్చిక చేసుకున్నారు. అప్పుడు ఆ సింహం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోరాటాన్ని ఉదృతం చేసాయి. వేరే సింహాల దాడిని తిప్పికొట్టడం మొదలెట్టాయి. కొన్ని సార్లయితే పక్షులు జంతువులు అన్ని కలిసి వేటాడే సింహాలని, పులుల్ని తరిమి కొట్టాయి.కొన్ని రోజుల తర్వాత ఒక నక్క చనిపోయింది. పది పన్నెండు సంవత్సరాల తర్వాత తమ అడవిని తమ ఆదీనం లోకి తెచ్చుకున్నాయి. పరిస్తుతులన్నే చల్ల బడ్డాయి. స్వరాజ్య ఆకాంక్ష నెరవేరింది. ఇప్పుడ ఆ అడవికి సింహమే రారాజు గా నిలిచింది. ఆ అడవి పక్షుల కేరింతలతో నిండిపోయింది. జంతువులన్నీ ఆ సింహాన్ని దేవుని లా కొలవడం ప్రారంభించాయి. ఆ సింహానికి జంతువులన్నీ స్వయంగా ఆహరం అవ్వడానికి కూడా సిద్ద పడ్డాయి. అలా కొన్ని రోజులు గడిచింది. ముసలిదైన ఆ నక్క మరోసారి అడవి పరిస్థితి ని సమీక్షించింది. అడవిలో ఉన్న అన్ని జంతువులు పక్షుల అభిప్రాయాన్ని అడిగి తెల్సుకుంది. ఇప్పుడు అందరం సుఖంగా ఉంటున్నాం అని, సింహం చాల గొప్పదని ఖితాబిచ్చాయి. కాని దానికి ఒక సంగతి అంతు బట్టలేదు. అసలు మొదట పోరాటం చేసిందే సింహాల అధికారాన్ని తప్పించి స్వతంత్రంగా బతకాలని, కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితి ని ఈ పిచ్చి పక్షులు జంతువులకి అర్ధం కానివ్వకుండా జాగ్రత్త పడుతుందన్న సంగతిని నక్క పసిగట్టింది . ఇలా లాభం లేదని, ఈ రాజ్యం లో ఉన్న ఈ ఒక్క సింహాన్ని కూడా తరిమేస్తేనే మనది అనుకున్న అడవి మన స్వంతం అవుతుంది అని అనుకున్నది ఆ నక్క. మళ్ళీ మొదలెట్టింది పక్షులని జంతువులని ఏకం చెయ్యడాన్ని. కొన్ని రహస్య సమావేశాలు కుడా ఏర్పాటు చేసింది. ఈ అడవి మనది, మనమే ఎక్కువ గా ఉన్నాం, మన పక్షులు, మన జంతువులు ఎంతో కష్ట పడి ఆహారాన్ని సంపాదించి తింటుంటే, ఆ సింహం మనల్ని తినడం ఏంటి ? అని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది . కానీ ఆ సమావేశం లో ఒక కాకి సింహానికి నమ్మిన బంటు గా ఉండేది. ఈ విషయాలని సింహం చెవులో వేసింది. అప్పుడు అగ్గిమీద గుగ్గిలం అయిన సింహం ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించమని దాని చెప్పు చేతల్లో ఉండే పక్షులకి జంతువులకి ఆదేశించింది. పన్నెండేళ్ళుగా పోరాటం లో గడిపిన అనుభవం ఆ సింహానికి చాలా ఉపయోగ పడింది.  ఒక ఉపాయం పన్నింది, ఈ చవట పక్షులు ఈ దద్దమ్మ జంతువులు ఎప్పుడు ఒక్కటి కావద్దు, కానివ్వకుండా చెయ్యాలి. అలా చేస్తేనే నేను ఈ అడవికి రాజు గా ఉండొచ్చు అనుకుంది. అనుకున్నదే తడవుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది సింహం. ఆ సభ కి అతిథులుగా పక్క అడవి సింహాలని ఆహ్వానించింది.అందరు చేరుకున్నారు ఆ సభ కి. ఇప్పుడు ఒక్కొక్కజాతి ని  ఆ జాతి లో ఒక్కొక్క వర్గాన్ని విడదీసి మరీ వారికీ తగ్గ పనులని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. కాకులు ఎగిరే ఎత్తు కంటే పైనే కొంగలు ఎగరాలని, అంత కంటే ఎత్తులో గద్దలు ఎగరాలని నిర్ణయించాయి. జంతువులకి కూడా పచ్చిక బయల్లను జింక లకి , చెట్ల ప్రదేశాన్ని కోతులకి కేటాయించింది. ఒకరి ప్రదేశం లో ఇంకొకరు అడుగు పెట్టొద్దని హెచ్చరించింది. ప్రతీ వర్గానికీ నజరానాలు ప్రకటించింది. ఆ సభ కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఇప్పుడు ఆ సింహం మొహం ఆనదం తో నిండి పోయింది. ఆ సభ లోనే నక్క మూలకి కూర్చుని  కన్పించింది, ఆ నక్క ని చూసి సింహం వెర్రి గా నవ్వి తోడేల్లకి సైగ చేసింది. ఆ తోడేళ్ళు నక్కని బయటకు గెంటేసాయి. అతిథి గా వచ్చిన సింహాలు ఈ అడవిలోనే తిష్ట వేసాయి. తిరిగి ఆ అడవి సింహాల చేతుల్లోకే వెళ్ళింది. ఆ అడవి పక్షులు జంతువులు ఆ సింహాలకి ఆనదంగా స్వయంగా ఆహారం అవుతున్నాయి. ప్రపంచం లోనే ఈ అడవి గొప్పదని కీర్తించడం చూసి పశుపక్షాదులన్నీ మురిసిపోతుంటే, ఆ ముసలి నక్క మరో సింహాన్ని తాయారు చేసే పనిలో నిమగ్నమయింది.