20150107

అంబేద్కర్ గుండెల మీద

ఎన్నో ఏండ్లు గా దాచిపెట్టిన
దారిద్ర్యమది అంబేద్కర్
దళిత వర్ణానికింకా నిర్లక్ష్యపు
సోగాసులద్దుతూనే ఉన్నది
నేర్పేవాడే లేనప్పుడు
నేర్పరి కొరకు రాయితీల జాతర లెందుకోయ్ ?
బహుషా ఆనాడు సాధించిన స్వాతంత్ర్యం
వట్టి మట్టి కోసమేనేమో భీం : అందుకే
ఆ తల్లి కడుపున వాడింకా
బానిస గానే పురుడు  పోసుకున్నడు.
బహుజన స్వాతంత్ర్యానికి మరోయుద్దం
మిగిలే ఉండదని ఊహించడం మరిచావేమో ?
వెలుగులు పంచే వెన్నల కోసం ఎంత వేగంగా వెదికినా
రాలిన తారలే తారస పడుతున్నరు .
సైందవులను జయించాలని చూసిన ప్రతి సారి
నీ చూపుడు వేలు బౌద్ధాన్ని జపిస్తుంది బాబా సాహెబ్.
నువ్వు ఒరిగితే ఓదార్చిన ఆ చెట్టే
అగ్రవర్ణ హరితం తో ముసలిదై మూలుగుతంది.
ఆనాడు పెట్టిన అద్దాల వన్నె తగ్గింది బీ. ఆర్.
పాతవి మార్చి కొత్తదారి చూపవోయ్ .
అవమానపు అనుమానాలేర్పడకుండా వేసుకున్న
ఆ నల్ల కోటిప్పుడు మురుగు కంపు కొడుతుంటే
నువ్విప్పుడుండాల్సింది ఆ రహదారి గద్దెల మీద కాదు అంబేద్కర్ ,
పీతిగొద్దెల మీద బతుకులీడుస్తున్న నా తమ్ముల గుండెల మీద...