20141208

స్వేచ్చా మహిళ

స్వేచ్చా మహిళ 

నీ కనుబొమ్మల మద్యన
నిలిచిన ఎర్రని బొట్టును
చూస్తున్నప్పుడల్లా
మత పెత్తనపు హింసనే
కళ్ళల్లో కదలాడుతున్నది.
దయ చేసి ఆ బొట్టు ను తుడిపెయ్యవు.
ఆ చేతి గాజుల చప్పుడు
విన్నప్పుడల్లా
ఓ మతోన్మాది
కత్తి తో కుత్తికలను తెంపిన
అర్థ నాదాలు వినిపిస్తున్నై .
మన్నించి ఆ గాజులను పగల గొట్టవూ.
కాళ్ళ కు పట్టీలు కట్టినప్పుడల్లా
మనుషులను కులాలుగా కుట్టి
కదలకుండా వేసిన బేడీలు గా
కన్పిస్తున్నై .
క్షమించి వాటిని విప్పేయవూ.
విధవ లా ఉన్నావ్ అంటారని భయపడకు
అనేవాళ్ళంతా మత పిచ్చి పట్టిన వెదవలు.
 నువ్విప్పుడే
అసలైన స్వాతంత్ర్యం సాధించిన
స్వేచ్చా మహిళవు .       

శబ్ద శంఖం

శబ్ద శంఖం 

నా తల పై ఆకాశం లేదు
నా పాదం కింద భూమి లేదు
నేనిప్పుడు
మతానికి మానవత్వానికి మద్య
నెక్కి నెక్కి నడుస్తున్నాను .
నా కళ్లిప్పుడు
ప్రపంచాన్ని చూడట్లేదు
వెనుక జరిగిన వేదనను
ముందున్న ముదురు ఎరుపు రంగును
మాత్రమే గమనిస్తున్నది.
నా చెవులిప్పుడు
ఏ శబ్ద తరంగాలను వినట్లేదు
ఆ శబ్ద  శంఖాలను పూరించిన
కంఠాలను వెదుకుతున్నది.
నా ముక్కిప్పుడు
శ్వాసించడం లేదు
ఈ గాలి లో విష వాయువులను
నింపిన వారెవరని వెటాడుతున్నది. 

మనిషితనానికి మతానికి
జరుగుతున్న మానసిక యుద్ధం ,
ఆయుధాలు ధరించిన వాడే
ప్రతిసారి విజయం సాధిస్తున్నడు.
అయినా ఈ పాదం
పదునైన కత్తుల మీద
నెత్తురు గక్కుతుంది.
ఏదో ఒక నాడు పారిన ఈ నెత్తురే
మానవత్వం వికసించిన
రహదారి అవుతుందని.