20150218

అమర కార్మిక

వాడు దేశం కోసం
భూమి పొరలతో
కొట్లాడుతున్న సైనికుడు. 
ఒంటి చేత్తో
సముద్రాన్ని ఆపుకుంటూ,
తొంట చేత్తో
బయటకు  బొగ్గును లగేస్తున్నడు.
అంతకంతకూ కూరుకు పోయే బతుకు,
అయినా దీపం కోసం వత్తిని పేనుతనేఉన్నడు. 
ప్రతిక్షణం
ప్రకృతి తో యుద్ధం చేస్తూ,
మేలిమి బంగారాన్ని వడుకుతున్నడు.
 గంట గంట కు పెంచే
ఉత్పత్తి లక్ష్యానికి,
ఊపిరి తిత్తులను రక్షణగా నిలిపి
లోడు లాడీసు ను గుంజుతున్నడు.
నరకబడ్డ శరీర భాగాలు ,
మాంసపు ముద్దలు రుద్దుకున్న
బొగ్గు పొరలు ,
రక్తం తో పేరుకు పోయిన
భూగర్భ గనులు.
ఓ వైపు ఉబికి వచ్చే ఊటలు
హటాత్తుగా తరుముకొస్తుంటే,
ధైర్యం గా బొగ్గుపెల్లను ముద్దాడి,
నీటి ప్రవాహం లో ఆవిరై, 
అమరత్వం పొందిన వీర జవాన్లు. 
ఉత్పత్తి లో ఊపిర్లు వదిలిన 
నవ జాతి రతనాలు . 
ఈ దేశం మీకు మూడు రంగుల 
జెండా కప్పక పోవచ్చు . 
మీ వీరత్వాన్ని వినిపిస్తూ 
ఏ తుపాకి గొట్టం పేలకపోవచ్చు. 
మీ శౌర్యానికి ఏ పతకమూ 
మెడలో వాలకపోవచ్చు . 
మీ పేర్లు ఏ శిలా ఫలకం మీద 
లిఖించబడకున్నా ,
 కార్మికుల మనో ఫలకాలమీద 
ఎప్పుడూ మారుమోగుతనే ఉంటాయి. 
ఎర్ర బుగ్గలు, ఎల్ ఇ డి బల్బులు మిమ్మల్ని 
ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉంటాయి . 
నిలిచినా మీ శ్వాసలు 
పంఖల రెక్కల్లో 
మాకు ఊపిర్లు పోస్తునే ఉంటాయి . 
   -----గని ప్రమాదాల్లో అమరత్వం పొందిన కార్మికులకు ...