20150814

చెదిరిన కల

కాస్తో కూస్తో ఎదిగిన మెదల్లప్పుడు
ఎదురు పడ్డం అనుకుంటా,
అంతలోనే ఎంతలా కలిసిపోయామో ?
వెలివేయబడ్డ ఊరు
నువ్వు నడిచొచ్చిన బురద రోడ్డు
నీకు గుర్తుందా మిత్రమా ?
నీ ప్రతీ మాట గుండెల్లో పాతుకు పోయింది.
ఎన్ని కళలు కన్నాం మిత్రమా ?
ఎండిపోయిన కలేబరాలకు
ప్రాణం నింపుదామని.
ఎన్నిసార్లు కన్నీరోలికించాం మిత్రమా
కష్టాల కడలిని ఈదుకుంటూ,
నాకోసం నువ్వ్వు నీకోసం నేనని.
గుండె రగిలే కదా
ఉద్యమం లో ఉప్పెనలా దూకింది
రగిలే గుండె పగిలే కదా
మనం ప్రజల పక్షాన నిలవాలనుకున్నది
అందుకేగా ఆర్దికంగా నిలదొక్కుకొని
అందరినీ ఆదరిద్దాం అనుకున్నాం.
పై పై కి ఎగిరి పంజరం లో చిక్కిన
పక్షులను కాపాడాలనుకున్నం.
బడా భవనాలు
బహుళ జాతి కంపినీ ల మాయలు
ఆరంకెల నోట్ల కట్టలు
నోటికి కరిపించుకుని
కనిపించకుండా ఎగిరిపోయావా మిత్రమా ??
ఎదగడానికి ఎవరన్నా
చెయ్యి అందిస్తే బాగుండు అనుకునేవాళ్ళం గా ,
అప్పుడిద్దరమూ అసహయులమే
ఆ క్షణమే మొదలెట్టా
ఒక్క చెయ్యి కోసం కాదు
మనలాంటి వాళ్ళ కొసం
పదివేల చేతులు అందించడానికి
గట్టు చుట్టూ అక్షరాల విత్తనాలు నాటడాన్ని .
మిత్రమా నిజమె నువ్వన్నట్టు
చేతన్ లా ప్రేమ కథలు రాసి డబ్బు చేస్కోడం నాకు రాదు.
బొగ్గు పొరల్లో రక్తపు మరకలు అంటిన వాణ్ని కదా
తెగిన పోగు ను వెదికి ముడేసే నేను,
 తోలు డప్పు అగ్గి కపేది నువ్వు,
 కన్నీటి సాల్లల్లో కలుపు పీకిన వాళ్ళ
 చేతులు కవ్వించే కథలల్లగలవా చెప్పు.
మిత్రమా వెలివేయ బడ్డ ఊరు అట్లానే ఉంది
నడిచిన బురద రోడ్డూ ఉంది.
అక్కడ లేనిదల్లా
 ప్రవహించే రక్తంతో
 పైసల ప్రవాహంలోకొట్టుకుపోయిన
మనంమాత్రమే మిత్రమా...

20150813

కొత్త రంగు కొమ్రన్న

యధార్ద సంఘంటన ఆధారంగా ..కొత్త రంగు కొమ్రన్న
నా పేరు రావణ. నేనుండే  చిన్న ఊర్లో ఒక పెద్ద పరిశ్రమ ఉంది. అందులో సుమారు నూరు నూట యాబై మంది పని చేస్తుంటారు. మా ఇంటి పక్కనే ఉండే కొమ్రన్న నాకు ఉద్దోగం ఇప్పిచ్చిండు.రోజు మేమే కలిసి నౌకరికి పోతుండే. మా దారి మద్యల ఓ చిన్న గుడి ఉన్నది . అది శివాలయం కానీ అందరు దాన్ని ఎందుకో రాజుల వారి గుడి అని పిలుత్తరు. అన్ల ఒక ముసలోడు పూజ చేసేటోడు. మా కొమ్రన్న వడ్లోడు గని జెర భక్తి ఎక్కువ నే. పొంగ రాంగ సెప్పులు ఇడిసి మొక్కకుండా ఉండడు. కొమ్రన్నకు ఆ ముసలోనికి మంచి సాయితనే ఉన్నది.ఇంటికి అచ్చేటప్పుడు ఆ ముసలోడు కొమ్రన్నకు కొబ్బరి కాయలు ఇచ్చేటోడు.కంపినీ జెర పెద్దదే , ఆ కంపిని ముందట ఒక పాడువడ్డ గుడి ఉండేది. నేను కొలువు జేరేటాలకే కంపోనీకి కొత్త మేనేజరు నార్త్ ఇండియన్ అచ్చిండు. అచ్చిన కొన్నొద్దులకే మా మంచిపేరు తెచ్చుకున్నడు. కంపినీల అందరు చేసేది జెర మోటు పనే, అన్ల మాటకారి అయిన మల్లడు మేనేజరు తోటి మంచిగా మెలిగి పనిలకెల్లి తప్పిచ్చుకుని జెర పెత్తనం చేస్తుండే. ఓ సారి మేనేజరు ఆ పాత గుడి గురించి మెల్లగా ఆరా తీసి దానికి మల్ల పూజ చెయ్యాలే. గుడి గట్ల మూలకు పడి ఉండుడు మంచిది కాదు, దేవత కు తిండి పెట్టకుండా మనం తింటే మహా పాపం అని జెప్పి ఓ పూజారిని పెట్టు, ఆనికి జీతం నేనే ఇస్తా అని మల్లనికి జెప్పిండు. వాడు గట్లనే అని ఆనికి తెల్సిన ఓ పూజారితో నీకో గుడి సూపిస్త, కానీ ఆన్ల ఇచ్చే జీతం ల నాకు కొంత పాలు ఇయ్యాలె అని షరతు పెట్టిండు. గట్లనే అని పూజారి గుడికి అచ్చి పూజ చేసి పోయ్యేటోడు.   ఇట్లా ఏడాది గడిసింది. ఓ నాడు రాజుల వారి గుడికాడ ఉండే ముసలోనికి సుస్థి చేసిందని కొమ్రన్నకు మతులావు పపిండు. నేను కొమ్రన్న కలిసి సైకిలు మీద ఆల్లింటికి పోయినం.
ఆ ముసలోడు "సివయ్యకు పూజ సేసుడు అయితలేదు" అని సానా బాధపడి "రేయ్ కొమ్రిగా నేను సదివే మంత్రాలు నీక్కూడా అచ్చు కదరా,  నువ్వే గా శివునికి రోజు పూజ సెయ్యచ్చు గదరా" అన్నాడు .
దానికి కొమ్రన్న " అయ్యా నేనా, నేను వడ్లోన్ని అయ్యా, నేనెట్ల గా పూజ చేసేది. తప్పయ్య" అన్నాడు
"అదేంలేదురా కొమ్రిగా మనసు మంచిగుంటే సాలు కులం తో పనెందిరా" అన్నాడుముసలోడు.
"అయినా అయ్యా నేను పనికి పొయ్యే టోన్ని, ఈడ పూజలు సేసుకుంట కుసుంటే నా కుటుంబం గడువది "అని కిందికి సూస్కుంట అన్నడు. "రేయ్ అట్లా అనుకోకు రా, కంపినీకి పొయ్యే ముందు ఒక అయిదు నిముషాలు, సాయంత్రం అచ్చేముంగట ఓ అయిదు నిముషాలు మంత్రాలు సదివి శివయ్య నెత్తి మీద ఇన్ని నీళ్ళు పోసి రారా ఇంకా నువ్వు ఏమీ సేప్పకు" అని తలం సేతులు కొమ్రన్న సేతుల పెట్టిండు.   కొమ్రన్నను దగ్గరికి పిలిసి సేవ్వుల ఎదో గుస గుస లాడిండు. అంతదాకా మొహం ఎట్లనో పెట్టుకున్న కొమ్రన్న నవ్వుకుంట కనిపిచ్చిండు.
ఆకాడికెల్లి రోజు నాతోటి కంపోనీకి అచ్చే కొమ్రన్న గుడిదాకా అచ్చి నన్ను పోమ్మనేటోడు. ఇట్లా ఓ ఆరునెల్ల తిరిగే సరికి పొద్దుగాల గంట సాయంత్రం గంట రాజుల వారి గుడి కాన్నే కూసునేటోడు. ఈ విషయం మెల్లగా కంపిన్ల అందరకి తెల్సింది. ఆ తర్వాత కొన్నొద్దులకు మా కంపినీల మేనేజరు కూడా మారిండు.ఈ మేనేజరు కొంచెం గట్టోడు, ఎవ్వల్ని దగ్గరికి తీసేటోడు కాదు. దాంతోటి మల్లన్న పెత్తనం కూడా తగ్గింది కంపిన్ల. కొత్త మేనేజరు కు కొంచెం భక్తి ఎక్కువ.కానీ కంపనీ గుడికి పూజారి రెండు మూడు దినాలకు ఒకసారి అచ్చుడు నచ్చక ఆ పూజారికి మేనేజరు కి కొంచెం లొల్లి అయింది. ఇగ నువ్వు పూజలు చెయ్యకు నువ్వు రాకు అని చెప్పిండు. తర్వాత రెండు రోజులు గుడి తలుపులు ఎవరు తియ్యలే. తెల్లారి పొద్దుగాల్నే మేనేజరు సారు నన్ను పిలిసి ఒక పూజారిని సూడు మన్నడు.
అయితే వెంటనే నా మెదట్లకు కొమ్రన్న యాదచ్చిండు. గీ మాటే మేనేజరు తోటి చెప్పిన మన కంపిన్ల కొమ్రన్న రోజు రాజులవారి గుల్లే పూజలు జేస్తడు అని. గట్లనా అయితే వాన్నే రోజు పూజ చేయ్యిమను అని చెప్పిండు మేనేజరు. "కానీ సారు ఆడు కులపోడు కాదు సారూ మంత్రాలయితే అచ్చు గంతే సారు" అని ఉన్నమాట చెప్పిన. అప్పుడు మేనేజరు "సూడయ్య నాకు ఏకులం అని కాదయ్యా , రోజు పూజ సేసేటోడు అయితే సాలు" అన్నడు.
 ఈ ముచ్చట నేనే కొమ్రన్నకు సేప్పుతే మస్తు సంబుర పడ్డడు.రెండు దినాలు ఆ గుల్లే ఈ గుల్లే పూజలు చేసి మద్యల కంపినీ పని చేసేటోడు. ఇక వారం తిరిగేటాలకు కొమ్రన్న కంపినీ పని ముట్టుకునుడే బంజేసిండు. ఇది చూసిన మల్లన్న కొందరిని పోగేసి మేనేజరు దగ్గరికి లోల్లికి పోయిండు. నన్ను రమ్మంటే నేను తప్పించుకున్న. ఒక కంపిన్ల   యాబై వేల నౌకరి చేసేటోన్ని వేరే పనికి ఎట్లా పెడతావ్ అని,  నిలదీసిండు మల్లన్న. అయినా మేనేజరు అదరలే బెదరలే, "నేను మేనేజరు ను. నేను ఒక మనిషిని ఎట్లైనా వాడు కోవచ్చు" అని ఎదో బుక్కు తీసి సూపెట్టిండు అందరికీ, అయినా మల్లన్న ఎంతకూ ఇనలేదు. ఇగ మేనేజరు కు వశ పడక కంపనీ పెద్దోల్లకు ఫోన్ చేసి మల్లన్న కు వార్నింగ్ ఇప్పిచ్చిండు. ఇగ మేనేజరు కూడా రోజూ గుడుకి అచ్చి గంట సేపు పూజ జరిపిచ్చి ప్రసాదం తిని పోయేటోడు. రోజు నాతోటి అచ్చే కొమ్రన్న నాతోటి అచ్చుడు బంజేసిండు. కొన్ని రోజులకు గడ్డం మీసాలు గీకిచ్చి, వెనుక చిన్న పిలుక పెట్టిచ్చిండు. పనికి అచ్చినంక కూడా బట్టలు మార్వకుండా గుల్లే ఉన్న కాషాయం బట్టలు మీద కప్పుకుని ఏవో పుస్తకాలు ముంగటేస్కుని కూసునేది. "గిదేందే కొమురన్న మొత్తం ఏషమే మర్సినావ్" అంటే బాపనోన్ని అయిన గదరా అని నవ్విండు.  మేం పని సేయ్యకుంటే అరిచే మేనేజరు కొమ్రన్న ను మాత్రం సూసి సిన్నగా నవ్వేది. కొమ్రన్న కు కూడా ఇదే మంచిగా నయ్యం అనిపియ్యవట్టింది. రోజు రెండు గుళ్ళలో పూజ చేసుడే పని. దీనికి కంపిని నుండి యాబై వేల జీతం తీస్కునుడు. సుక్రారం అచ్చిందంటే సాలు ఇంట్ల ప్రసాదం అండిపిచ్చి కంపిన్ల అందరికి పంచిపెట్టే ప్రసాదం కోసం అందరు లైన్లు కట్టేటోల్లు.దానికి తోడు వాడో వీడో గుడికి దానం అని బియ్యం, శెక్కర, శేనిగలు దానం ఇచ్చేటోల్లు.దీన్ని చూసి కొమ్రన్న మంచి ఉపాయమే ఏసిండు అనుకున్న. ఇంకా రోజు మేనేజరు రూమ్ లకు పొయ్యి నాలుగు మంత్రాలు సదివి బొట్టు పెట్టి అచ్చుడు కూడా నేర్సుకున్నడు.  అందరికి పూజారి అయ్యిండు. కొన్ని దినాలకు మల్లో కొత్త మేనేజరు అచ్చిండు. ఈడు జెర మొండోడు.అచ్చి నెల రోజులైనా గుడి మొకాన సూల్లేదు.  మల్లన్న మెల్లగా కొత్త మేనేజరు కు దగ్గర అయ్యి కొమ్రన్నను మల్ల పనిల ఇరికియ్యాలే అని ఉపాయం ఏసిండు. ఈ విషయం కొమ్రన్న కు నేనే చెప్పిన. తెల్లారి పొద్దుగాల్నే అచ్చి గుడినంతా కడిగి, హోమ గుండం తాయారు చేసిండు. కంపినీల అందరికి ఇయ్యాల మంచి దినం అని ఎదో ఆకాశం ల సుక్కలు కలుస్తున్నాయని చెప్పి, మేనేజరు తో హోమం చేపియ్యలె అని నిర్ణయించిండు. కొంతమందిని జమ చేసి బలవంతంగా మేనేజరు తోటి హోమం కాల్పించారు. మరునాడు ఉదయమే కొమ్రన్న మేనేజరు దగ్గరికి వెళ్లి పూజకు రమ్మని ఆహ్వానించాడు, దానికి మేనేజరు "నాకివన్నీ పడవు, నువ్వే కానివ్వు " అన్నాడు. "లేదు సర్ ఇది మన కంపెనీ సంప్రదాయం, ప్రతీ మేనేజర్ రోజు వచ్చి పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు కూడా రావాలి" అని ఒప్పించిండు. తప్పక మేనేజరు గుడికి చేరుకున్నడు. పూజ విదానం సమయం చూసి "చూడు కొమ్రన్న నాకు ఇంతసేపు ఇక్కడ ఉండే ఓపిక లేదు కాని రోజూ ఎదో రెండు మంత్రాలు చదివి హారతి ఇచ్చి నన్ను బైట పడేసే ఏర్పాటు చేయ"మన్నాడు. ఒక రోజు కంపెనీలకు ఒగడు ఉరికచ్చి ఎగబోసుకుంట మేనేజరు తోటి ఎదో చెప్పవట్టిండు. వెంటనే మేనేజరు కొమ్రన్నను పిలిసి ఎదో చెప్తే కొమ్రన్న కన్లల్ల నీళ్ళు తిరిగినై, నాదగ్గరికి ఉరికచ్చి నన్ను బైటకి తోలుకపోయ్యిండు. ఏందీ విషయం అంటే ఆ రాజుల గుడి కాడి ముసలోడు సచ్చిపోయిండు అని చిన్నగా ఎడ్వసాగిండు, నేనే సముదాయించి శవం దగ్గరికి తోల్క పోయిన. మన కొమ్రన్నకు మంత్రాలు బాగా ఒంటబట్టినై. ఆ శవం మీద నీళ్ళు సల్లి ఎవ్వో పనికి రాని మంత్రాలు సదివిండు.ఇక్కడ మంత్రాలు చూసి మల్ల ఎవడన్న పోతే కొమ్రన్ననే పిలుస్తారని వీడి ఉపాయం అని అర్దమై నాలో నేనే నవ్వుకున్నా.ఆ ముసలోన్ని చితి మీద కాలుతుంటే ఉండబట్ట లేక "కొమ్రాన్నా ఆ ముసలోడు ఆ రోజు నీ చెవ్వుల ఎదో చెప్పిండు గదేందే?" అని అడిగిన, అప్పుడు చిన్నగా నవ్వుతు "నీ జీతం కంటే ఎక్కువ పైసలు ఒక్క గంట సేపట్ల రాజుల గుడి కాడ దొరుకుతాయి రా "అన్నడు. మరునాడు మేనేజరు అచ్చి మల్లన్న తో ఎదో మాట్లాడుతుంటే, నేను కొమ్రన్నను  చూసి ఎమన్నా మళ్ళా నీకు ఎసరు పెడుతండా ఏందీ మల్లిగాడు ? అంటే ఆని చెయ్యి ఎప్పుడో దాటి పోయింది లేరా అన్నడు. "మరి ఎట్టా ఉంది మన కొత్త మేనేజరు ఎవ్వారం" అని అడిగా. కొమ్రన్న మీసాల మీద వేళ్ళతో రాస్తూ ఇప్పుడిప్పుడే తెల్లగయ్యే కొద్ది రంగేస్తున్న, కొన్నొద్దులైతే నల్లవడుతై అన్నడు. అలాఅచ్చిన కొత్త మేనేజరు కల్లా కొమ్రన్న కొత్త రంగు ఏసుకుంట వాడి పనిని కాపాడుకుంట ఉన్నడు.