20151109

మేరా ఇండియా మహాన్

హోహ్హూ ... మేరా ఇండియా మహాన్... సారీ నాకు భారత్ అని పిలవడం ఇష్టం లేదు. ఫిర్ భీ మేరా ఇండియా  తో మహాన్ హీ రహేగా. డెవలపింగ్ కంట్రీ ఇన్ అన్ డెవలప్డ్ లిస్టు. కనిపెట్టిన సున్నా చుట్టూ ఇంకా తిరుగుతూ మీసాలు దువ్వుకునే గొండ్రి కప్పలు. వేల యేండ్ల నుండి ఇదో అంగడి. చైనా మొబైల్ సె ఐ ఫోన్ తక్. వన్నా సెల్ ఇట్ దెన్ సెండ్ ఇట్ టు ఇండియా. సామ్నే హే సోషల్ మీడియా కా జమానా యే సోచ్ కే ఆయా స్టీవ్. చైనా ఓడు ఎవడి మాటా వినడు. మిగిలినోడు ఎవడినీ కాదనలేడు. ఇదేందో నాకంటే నా దేశం కాదు కాదు ఈ దేశం గురించి పక్కోల్లె ఎక్కువ గా సదివినట్టు ఉన్నారు. లాగి పెట్టి ఒక్కటిచ్చావనుకో నిన్నే గొప్పోడివంటాడు.సీక్రెట్ చెప్తా విను " ఒక చెంప మీద కొట్టావనుకో, వాడె ఇంకో చెంప చూపిస్తాడు" ఆఫర్ మాత్రం నువ్వే డిస్ప్లే చెయ్యాలి సుమా ఒక దెబ్బ తిన్న వానికి రెండో దెబ్బ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈ మాట వింటే చాలు ఎగబడి చస్తారు జనం. ఇంతటి బ్రహ్మాండమైన బజార్ ప్రపంచం లో  ఎక్కడా కనపడదు.  ఎప్పుడోచ్చామన్నది కాదన్నయా, ఇండియన్ గుండెల్లో తిష్ట వేసావా లేదా అన్నదే ముఖ్యం. అంత బాగానే ఉంది గాని నా వైపు చూస్తాడంటావా ? అయినా చూడక చస్తాడా ! వాడు చూసే చూపే నీదైనప్పుడు. థింక్ అబౌట్ కామన్ ఇండియన్ మాన్. దురద అంటించడమే ఆలస్యం, గోక్కోడం అలవాటే . తయారు చేసి వాడి మొహాన పడేసావనుకో నాకి నాకి చస్తారు. సెంటిమెంటు మీద చిన్న గా గిల్లావే అనుకో గిలా గిలా కొట్టుకుని నీ వెంటే పరిగెడతారు. అసలు నాసా అంతలా ఎందుకు సక్సెస్ అయింది అనుకున్నావు , వాళ్ళు ఎగరేసే రాకేట్లన్నీ భారత దేశ రాఖాంశానికి అడ్డంగా పోతేనేనట. స్పిరిట్ రోవర్ కూడా గురు గ్రహం మీద భారత దేశ మట్టి ని కాసింత వెదజల్లిందట. ఐడియా ఎవరిదనుకున్నావ్ దట్ టూ ఇండియన్ ది గ్రేట్ చెంబు. అసలు ఐ ఫోన్ సృష్టి కర్త స్టీవ్ స్టవ్ అంటించడం నేర్చుకుంది ఇక్కడే. నో డౌట్స్ ప్లీస్...! ఇక్కడే స్టవ్ అంటించడం నేర్చుకుంటే వంట కూడా ఇక్కడే వండొచ్చు కదా అనుకుంటున్నారా ? ఇప్పుడే చెప్పాను కదా డౌట్స్ వద్దని, ఆశ దోష అప్పడం, ఆయనకి తెలియదనుకున్నారా మనకి పక్కింటి పాచి కురనే ఇష్టం అని. భారతీయుడి రుచి చూడాలంటే పురాణాలన్నీ చదవాల్సిన అవసరం లేదు లే ఒక్క సారి టూర్ వేస్తె చాలు. "వడ్డించే వాడు మనోడైతే ఎక్కడ ఉన్నా ఒక్కటే". అయితే ఇప్పుడెం చెయ్యమంటావ్ స్టీవ్ ? వడ్డించే వాడు మీవోడే అని ప్రచారం చెయ్యి, అర్ధం కాలే ,గూగుల్ మార్చేసినట్టు నువ్వు మార్చేయి ! హయ్యో మైక్రో సాఫ్ట్ మహానుభావా  సీఈవో పోస్ట్ ఇండియన్ కి ఇచ్చేయ్. వ్హాట్ ??? ముహ్ బంద్ కర్ సునో సాఫ్టు. మహా అయితే రెండేళ్ళు ఊపిక పట్టు. రెండు శతాబ్దాలు తల్చుకు తల్చుకు చస్తారు.  అంతలో మన బిసినెస్ రెట్టింపు అవుతుంది. బాద్ మే పోస్ట్ నికాల్ కే బాహర్ ఫెంక్. ఇదే బిసినెస్ సీక్రెట్ భయ్యా. రేయ్ ఎవడో అరుస్తున్నట్టు ఉన్నాడు "మేరా భారత్ మహాన్. మేరా భారత్.... మేరా... "హే అప్పుడే మర్చేసావా ?? పర్లేదయ్యా సాఫ్టు చాలా ఫాస్టే ఉన్నావ్. కాస్త వాన్ని రావడం ఆపమను.

20151102

అఖ్లాక్

అఖ్లాక్
-----------
ఉరిసే గుడిసె లో
మాడి పోయిన బొచ్చ లో
మాంసాన్ని మాత్రం ఉడికించబోకు.
అమాంతం మనిషి మాంసాన్ని మింగేసే
రాబందులు కుర్చున్నై డిల్లీ గద్దెల మీద
న్యారేటేడ్ బై నరేంద్ర,
క్యారీడ్ అవే బై కార్యకర్తలు.
కాషాయ మోజులో కషాయ చేష్టలు
don't care bro
ఊరు చివర నుండి
మరింత దూరం విసిరేయబడ్డావ్,
ఇన్నాళ్ళు అంటరానివాడవన్నారు,
ఇప్పుడు అంటితే చంపెస్తున్నారంతే ,
డిజిటల్ ఇండియా లో మిషిన్లన్నీ
నేలను దున్నుతున్నా ,
పశుభారాన్ని మాత్రం నిన్నే మోయమంటాడు .
పెంచిన చెట్టు ఫలాన్ని కూడా తినోద్దంటాడు.
పాలిచ్చి లాలించే బర్రె మీద
ప్రేమ లేదంటావా ??
పిల్లవాడా !! దాని తోలు తెలుపు కాదుగా
మొదట ఆవు గడ్డి తిన్నాకే
నీ కంచం లో పేడ నిండుతుంది.
పెదవి విప్పడానికో,
వద్దని ముక్కు చిట్లించడానికో
నీ అవయవాలు నీదగ్గర లేవులే.
కాలే కడుపునకు కట్లు వేసి
నువ్వు కాటికి పయనమైనా పట్టించుకోరు
లౌకికత్వం మంటగలిసి
మౌకిక రాజ్యాంగం ఏలుతున్న రాజ్యం లో
మనమంతా చచ్చిన శవాలమే అఖ్లాక్.
(గో మాంసం పేరు తో హత్య గావించ బడ్డ సోదరునికి )

మాటలు

ఆ మాటలెంత మధురంగా ఉండేవి.ఎంత బాగా మాట్లాడుకునేవాళ్ళం. పిలుపులు పలుకులు ఇక ఇకలు పక పకలు. అరుపులు గోలలు. పిచ్చ పిచ్చ గా నవ్వుకుంటూనే మటాడుకుంటున్నం.   లోల్ రాఫెల్ రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ అండ్ లాఫింగ్ హయ్య బాబోయ్ కిందపడి బొర్లుతు నవ్వుతున్నామ్. మనమంతా ఫుల్లీ లోడెడ్ గన్స్. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే చాలు ఇక వర్షాలే వర్షాలు. విరగబడి నవ్వే పువ్వుల వర్షాలు. ఒక్క నొక్కుడు క్లిక్కు తో మారి పొయ్యే స్టిక్కర్. వై యు లేట్ డియర్, కమాన్ స్టిచ్ యువర్ లిప్స్ అండ్ కిస్ యువర్ కీస్ విత్ ఫింగర్ టిప్స్.  ఏంటలా చూస్తున్నావ్ ?? ఇంకా దిగలేదా అగ్గదే సేల్ఫీ. అప్ లోడిట్ బాబ . ఇంకేన్నాల్లని పాత ప్రొఫైల్ పిక్ చూడమంటావ్ ? వెయిట్ వెయిట్ ఇప్పడిప్పుడే  కొద్ది కొద్దిగా గుర్తొస్తుంది, మన దోస్త్ గాడు చేతిలో కేనాన్  రీల్ కెమరా పట్టుకుని పోజు కొడుతుంటే  వాణ్ణి బతిమాలి బతిమాలి ఒక్క ఫోటో దించురా ప్లీస్ అని అందులో మూత తియ్యకుండానే  మూడు ఫోటోలు తీసి నాలుక కర్చుకుని, ముప్పై నాలుగు ఫోటోలు తియ్యడానికి ముప్పై రోజులు ఎదురుచూసి, దిగిన ఒక్క ఫోటో ను కడుక్కోడానికి కలర్ ల్యాబ్ ల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి తిరిగి, వచ్చిన కలర్ ఫోటోలో కాస్త కలర్ తగ్గిందని అటు తీసిన వాణ్ణి ఇటు కడిగిన వాణ్ని తిట్టుకుంటూ... హం పాత కథ మల్లీ ఎందుకు బ్రో, ఇట్స్ సేల్ఫీ టైం.ఇప్పుడు  ఫోటో తియ్యడానికి మన నోటి ముత్యాలు  జారవిడవాల్సిన పని లేదు. పైగా మన ముఖాన్ని పక్కోడు కడగాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ సే యువర్ సెల్ఫ్ స్మైల్ అండ్ ప్రెస్.కోపం వచ్చినప్పుడు " రేయ్ ఇంకా నేను వాడితో మాట్లాడను రా" అని ఎవడన్నా అంటే " ఎందుకురా , వాడు మన ఫ్రెండే కదరా " అనే డైలాగులు వినపడవిక్కడ. నచ్చలేదా ?? పేను చిటుక్కుమన్నట్టు చటుక్కున ఒక్క నొక్కు నొక్కావంటే ఇక అంతే, జస్ట్ ఉన్ఫ్రెండ్ ఇట్ యార్. ఎదవ కి ఎదుక్కుని చూసే దాకా తెలీదు నా లిస్టు లో ఒక ఫ్రెండు ఎగిరి పోయ్యాడని.  ఇంకెప్పుడవుతావు అప్ డేటు. ఇంకా ఆలస్యం చెయ్యమాక. కుట్టాల్సింది తెగిన చెప్పులను కాదురా సోదరా వాట్స్అప్ ఫేవికిక్కు తో పెదాలను గట్టిగా అతికించేసి కాముష్ గా కామెడీ కామెంట్ పెట్టేసేయ్.ఆస్తులని అమెజాన్ లో విసిరేసి వస్తువులను తెచ్చుకుందాం. కాలు కదపనేల మాట విడువ నేల కమింగ్ అప్ దివాలి దమాకా డిజిటల్ లైటింగ్ అదిరి పొయ్యి డిటిఎస్ బద్దలవ్వాల. అన్నట్టు చెప్పడం మర్చిపోయ్యా ఎక్కడో గింతంత మనసు అతుక్కుని ఉండే ఉంటది దాన్ని కూడా మక్షిమమ్ సెల్లింగ్ ప్రైస్ కి  ఓఎల్ఎక్స్ లో ఆడ్ పోస్ట్ చేసేద్దాం.

20150814

చెదిరిన కల

కాస్తో కూస్తో ఎదిగిన మెదల్లప్పుడు
ఎదురు పడ్డం అనుకుంటా,
అంతలోనే ఎంతలా కలిసిపోయామో ?
వెలివేయబడ్డ ఊరు
నువ్వు నడిచొచ్చిన బురద రోడ్డు
నీకు గుర్తుందా మిత్రమా ?
నీ ప్రతీ మాట గుండెల్లో పాతుకు పోయింది.
ఎన్ని కళలు కన్నాం మిత్రమా ?
ఎండిపోయిన కలేబరాలకు
ప్రాణం నింపుదామని.
ఎన్నిసార్లు కన్నీరోలికించాం మిత్రమా
కష్టాల కడలిని ఈదుకుంటూ,
నాకోసం నువ్వ్వు నీకోసం నేనని.
గుండె రగిలే కదా
ఉద్యమం లో ఉప్పెనలా దూకింది
రగిలే గుండె పగిలే కదా
మనం ప్రజల పక్షాన నిలవాలనుకున్నది
అందుకేగా ఆర్దికంగా నిలదొక్కుకొని
అందరినీ ఆదరిద్దాం అనుకున్నాం.
పై పై కి ఎగిరి పంజరం లో చిక్కిన
పక్షులను కాపాడాలనుకున్నం.
బడా భవనాలు
బహుళ జాతి కంపినీ ల మాయలు
ఆరంకెల నోట్ల కట్టలు
నోటికి కరిపించుకుని
కనిపించకుండా ఎగిరిపోయావా మిత్రమా ??
ఎదగడానికి ఎవరన్నా
చెయ్యి అందిస్తే బాగుండు అనుకునేవాళ్ళం గా ,
అప్పుడిద్దరమూ అసహయులమే
ఆ క్షణమే మొదలెట్టా
ఒక్క చెయ్యి కోసం కాదు
మనలాంటి వాళ్ళ కొసం
పదివేల చేతులు అందించడానికి
గట్టు చుట్టూ అక్షరాల విత్తనాలు నాటడాన్ని .
మిత్రమా నిజమె నువ్వన్నట్టు
చేతన్ లా ప్రేమ కథలు రాసి డబ్బు చేస్కోడం నాకు రాదు.
బొగ్గు పొరల్లో రక్తపు మరకలు అంటిన వాణ్ని కదా
తెగిన పోగు ను వెదికి ముడేసే నేను,
 తోలు డప్పు అగ్గి కపేది నువ్వు,
 కన్నీటి సాల్లల్లో కలుపు పీకిన వాళ్ళ
 చేతులు కవ్వించే కథలల్లగలవా చెప్పు.
మిత్రమా వెలివేయ బడ్డ ఊరు అట్లానే ఉంది
నడిచిన బురద రోడ్డూ ఉంది.
అక్కడ లేనిదల్లా
 ప్రవహించే రక్తంతో
 పైసల ప్రవాహంలోకొట్టుకుపోయిన
మనంమాత్రమే మిత్రమా...

20150813

కొత్త రంగు కొమ్రన్న

యధార్ద సంఘంటన ఆధారంగా ..కొత్త రంగు కొమ్రన్న
నా పేరు రావణ. నేనుండే  చిన్న ఊర్లో ఒక పెద్ద పరిశ్రమ ఉంది. అందులో సుమారు నూరు నూట యాబై మంది పని చేస్తుంటారు. మా ఇంటి పక్కనే ఉండే కొమ్రన్న నాకు ఉద్దోగం ఇప్పిచ్చిండు.రోజు మేమే కలిసి నౌకరికి పోతుండే. మా దారి మద్యల ఓ చిన్న గుడి ఉన్నది . అది శివాలయం కానీ అందరు దాన్ని ఎందుకో రాజుల వారి గుడి అని పిలుత్తరు. అన్ల ఒక ముసలోడు పూజ చేసేటోడు. మా కొమ్రన్న వడ్లోడు గని జెర భక్తి ఎక్కువ నే. పొంగ రాంగ సెప్పులు ఇడిసి మొక్కకుండా ఉండడు. కొమ్రన్నకు ఆ ముసలోనికి మంచి సాయితనే ఉన్నది.ఇంటికి అచ్చేటప్పుడు ఆ ముసలోడు కొమ్రన్నకు కొబ్బరి కాయలు ఇచ్చేటోడు.కంపినీ జెర పెద్దదే , ఆ కంపిని ముందట ఒక పాడువడ్డ గుడి ఉండేది. నేను కొలువు జేరేటాలకే కంపోనీకి కొత్త మేనేజరు నార్త్ ఇండియన్ అచ్చిండు. అచ్చిన కొన్నొద్దులకే మా మంచిపేరు తెచ్చుకున్నడు. కంపినీల అందరు చేసేది జెర మోటు పనే, అన్ల మాటకారి అయిన మల్లడు మేనేజరు తోటి మంచిగా మెలిగి పనిలకెల్లి తప్పిచ్చుకుని జెర పెత్తనం చేస్తుండే. ఓ సారి మేనేజరు ఆ పాత గుడి గురించి మెల్లగా ఆరా తీసి దానికి మల్ల పూజ చెయ్యాలే. గుడి గట్ల మూలకు పడి ఉండుడు మంచిది కాదు, దేవత కు తిండి పెట్టకుండా మనం తింటే మహా పాపం అని జెప్పి ఓ పూజారిని పెట్టు, ఆనికి జీతం నేనే ఇస్తా అని మల్లనికి జెప్పిండు. వాడు గట్లనే అని ఆనికి తెల్సిన ఓ పూజారితో నీకో గుడి సూపిస్త, కానీ ఆన్ల ఇచ్చే జీతం ల నాకు కొంత పాలు ఇయ్యాలె అని షరతు పెట్టిండు. గట్లనే అని పూజారి గుడికి అచ్చి పూజ చేసి పోయ్యేటోడు.   ఇట్లా ఏడాది గడిసింది. ఓ నాడు రాజుల వారి గుడికాడ ఉండే ముసలోనికి సుస్థి చేసిందని కొమ్రన్నకు మతులావు పపిండు. నేను కొమ్రన్న కలిసి సైకిలు మీద ఆల్లింటికి పోయినం.
ఆ ముసలోడు "సివయ్యకు పూజ సేసుడు అయితలేదు" అని సానా బాధపడి "రేయ్ కొమ్రిగా నేను సదివే మంత్రాలు నీక్కూడా అచ్చు కదరా,  నువ్వే గా శివునికి రోజు పూజ సెయ్యచ్చు గదరా" అన్నాడు .
దానికి కొమ్రన్న " అయ్యా నేనా, నేను వడ్లోన్ని అయ్యా, నేనెట్ల గా పూజ చేసేది. తప్పయ్య" అన్నాడు
"అదేంలేదురా కొమ్రిగా మనసు మంచిగుంటే సాలు కులం తో పనెందిరా" అన్నాడుముసలోడు.
"అయినా అయ్యా నేను పనికి పొయ్యే టోన్ని, ఈడ పూజలు సేసుకుంట కుసుంటే నా కుటుంబం గడువది "అని కిందికి సూస్కుంట అన్నడు. "రేయ్ అట్లా అనుకోకు రా, కంపినీకి పొయ్యే ముందు ఒక అయిదు నిముషాలు, సాయంత్రం అచ్చేముంగట ఓ అయిదు నిముషాలు మంత్రాలు సదివి శివయ్య నెత్తి మీద ఇన్ని నీళ్ళు పోసి రారా ఇంకా నువ్వు ఏమీ సేప్పకు" అని తలం సేతులు కొమ్రన్న సేతుల పెట్టిండు.   కొమ్రన్నను దగ్గరికి పిలిసి సేవ్వుల ఎదో గుస గుస లాడిండు. అంతదాకా మొహం ఎట్లనో పెట్టుకున్న కొమ్రన్న నవ్వుకుంట కనిపిచ్చిండు.
ఆకాడికెల్లి రోజు నాతోటి కంపోనీకి అచ్చే కొమ్రన్న గుడిదాకా అచ్చి నన్ను పోమ్మనేటోడు. ఇట్లా ఓ ఆరునెల్ల తిరిగే సరికి పొద్దుగాల గంట సాయంత్రం గంట రాజుల వారి గుడి కాన్నే కూసునేటోడు. ఈ విషయం మెల్లగా కంపిన్ల అందరకి తెల్సింది. ఆ తర్వాత కొన్నొద్దులకు మా కంపినీల మేనేజరు కూడా మారిండు.ఈ మేనేజరు కొంచెం గట్టోడు, ఎవ్వల్ని దగ్గరికి తీసేటోడు కాదు. దాంతోటి మల్లన్న పెత్తనం కూడా తగ్గింది కంపిన్ల. కొత్త మేనేజరు కు కొంచెం భక్తి ఎక్కువ.కానీ కంపనీ గుడికి పూజారి రెండు మూడు దినాలకు ఒకసారి అచ్చుడు నచ్చక ఆ పూజారికి మేనేజరు కి కొంచెం లొల్లి అయింది. ఇగ నువ్వు పూజలు చెయ్యకు నువ్వు రాకు అని చెప్పిండు. తర్వాత రెండు రోజులు గుడి తలుపులు ఎవరు తియ్యలే. తెల్లారి పొద్దుగాల్నే మేనేజరు సారు నన్ను పిలిసి ఒక పూజారిని సూడు మన్నడు.
అయితే వెంటనే నా మెదట్లకు కొమ్రన్న యాదచ్చిండు. గీ మాటే మేనేజరు తోటి చెప్పిన మన కంపిన్ల కొమ్రన్న రోజు రాజులవారి గుల్లే పూజలు జేస్తడు అని. గట్లనా అయితే వాన్నే రోజు పూజ చేయ్యిమను అని చెప్పిండు మేనేజరు. "కానీ సారు ఆడు కులపోడు కాదు సారూ మంత్రాలయితే అచ్చు గంతే సారు" అని ఉన్నమాట చెప్పిన. అప్పుడు మేనేజరు "సూడయ్య నాకు ఏకులం అని కాదయ్యా , రోజు పూజ సేసేటోడు అయితే సాలు" అన్నడు.
 ఈ ముచ్చట నేనే కొమ్రన్నకు సేప్పుతే మస్తు సంబుర పడ్డడు.రెండు దినాలు ఆ గుల్లే ఈ గుల్లే పూజలు చేసి మద్యల కంపినీ పని చేసేటోడు. ఇక వారం తిరిగేటాలకు కొమ్రన్న కంపినీ పని ముట్టుకునుడే బంజేసిండు. ఇది చూసిన మల్లన్న కొందరిని పోగేసి మేనేజరు దగ్గరికి లోల్లికి పోయిండు. నన్ను రమ్మంటే నేను తప్పించుకున్న. ఒక కంపిన్ల   యాబై వేల నౌకరి చేసేటోన్ని వేరే పనికి ఎట్లా పెడతావ్ అని,  నిలదీసిండు మల్లన్న. అయినా మేనేజరు అదరలే బెదరలే, "నేను మేనేజరు ను. నేను ఒక మనిషిని ఎట్లైనా వాడు కోవచ్చు" అని ఎదో బుక్కు తీసి సూపెట్టిండు అందరికీ, అయినా మల్లన్న ఎంతకూ ఇనలేదు. ఇగ మేనేజరు కు వశ పడక కంపనీ పెద్దోల్లకు ఫోన్ చేసి మల్లన్న కు వార్నింగ్ ఇప్పిచ్చిండు. ఇగ మేనేజరు కూడా రోజూ గుడుకి అచ్చి గంట సేపు పూజ జరిపిచ్చి ప్రసాదం తిని పోయేటోడు. రోజు నాతోటి అచ్చే కొమ్రన్న నాతోటి అచ్చుడు బంజేసిండు. కొన్ని రోజులకు గడ్డం మీసాలు గీకిచ్చి, వెనుక చిన్న పిలుక పెట్టిచ్చిండు. పనికి అచ్చినంక కూడా బట్టలు మార్వకుండా గుల్లే ఉన్న కాషాయం బట్టలు మీద కప్పుకుని ఏవో పుస్తకాలు ముంగటేస్కుని కూసునేది. "గిదేందే కొమురన్న మొత్తం ఏషమే మర్సినావ్" అంటే బాపనోన్ని అయిన గదరా అని నవ్విండు.  మేం పని సేయ్యకుంటే అరిచే మేనేజరు కొమ్రన్న ను మాత్రం సూసి సిన్నగా నవ్వేది. కొమ్రన్న కు కూడా ఇదే మంచిగా నయ్యం అనిపియ్యవట్టింది. రోజు రెండు గుళ్ళలో పూజ చేసుడే పని. దీనికి కంపిని నుండి యాబై వేల జీతం తీస్కునుడు. సుక్రారం అచ్చిందంటే సాలు ఇంట్ల ప్రసాదం అండిపిచ్చి కంపిన్ల అందరికి పంచిపెట్టే ప్రసాదం కోసం అందరు లైన్లు కట్టేటోల్లు.దానికి తోడు వాడో వీడో గుడికి దానం అని బియ్యం, శెక్కర, శేనిగలు దానం ఇచ్చేటోల్లు.దీన్ని చూసి కొమ్రన్న మంచి ఉపాయమే ఏసిండు అనుకున్న. ఇంకా రోజు మేనేజరు రూమ్ లకు పొయ్యి నాలుగు మంత్రాలు సదివి బొట్టు పెట్టి అచ్చుడు కూడా నేర్సుకున్నడు.  అందరికి పూజారి అయ్యిండు. కొన్ని దినాలకు మల్లో కొత్త మేనేజరు అచ్చిండు. ఈడు జెర మొండోడు.అచ్చి నెల రోజులైనా గుడి మొకాన సూల్లేదు.  మల్లన్న మెల్లగా కొత్త మేనేజరు కు దగ్గర అయ్యి కొమ్రన్నను మల్ల పనిల ఇరికియ్యాలే అని ఉపాయం ఏసిండు. ఈ విషయం కొమ్రన్న కు నేనే చెప్పిన. తెల్లారి పొద్దుగాల్నే అచ్చి గుడినంతా కడిగి, హోమ గుండం తాయారు చేసిండు. కంపినీల అందరికి ఇయ్యాల మంచి దినం అని ఎదో ఆకాశం ల సుక్కలు కలుస్తున్నాయని చెప్పి, మేనేజరు తో హోమం చేపియ్యలె అని నిర్ణయించిండు. కొంతమందిని జమ చేసి బలవంతంగా మేనేజరు తోటి హోమం కాల్పించారు. మరునాడు ఉదయమే కొమ్రన్న మేనేజరు దగ్గరికి వెళ్లి పూజకు రమ్మని ఆహ్వానించాడు, దానికి మేనేజరు "నాకివన్నీ పడవు, నువ్వే కానివ్వు " అన్నాడు. "లేదు సర్ ఇది మన కంపెనీ సంప్రదాయం, ప్రతీ మేనేజర్ రోజు వచ్చి పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు కూడా రావాలి" అని ఒప్పించిండు. తప్పక మేనేజరు గుడికి చేరుకున్నడు. పూజ విదానం సమయం చూసి "చూడు కొమ్రన్న నాకు ఇంతసేపు ఇక్కడ ఉండే ఓపిక లేదు కాని రోజూ ఎదో రెండు మంత్రాలు చదివి హారతి ఇచ్చి నన్ను బైట పడేసే ఏర్పాటు చేయ"మన్నాడు. ఒక రోజు కంపెనీలకు ఒగడు ఉరికచ్చి ఎగబోసుకుంట మేనేజరు తోటి ఎదో చెప్పవట్టిండు. వెంటనే మేనేజరు కొమ్రన్నను పిలిసి ఎదో చెప్తే కొమ్రన్న కన్లల్ల నీళ్ళు తిరిగినై, నాదగ్గరికి ఉరికచ్చి నన్ను బైటకి తోలుకపోయ్యిండు. ఏందీ విషయం అంటే ఆ రాజుల గుడి కాడి ముసలోడు సచ్చిపోయిండు అని చిన్నగా ఎడ్వసాగిండు, నేనే సముదాయించి శవం దగ్గరికి తోల్క పోయిన. మన కొమ్రన్నకు మంత్రాలు బాగా ఒంటబట్టినై. ఆ శవం మీద నీళ్ళు సల్లి ఎవ్వో పనికి రాని మంత్రాలు సదివిండు.ఇక్కడ మంత్రాలు చూసి మల్ల ఎవడన్న పోతే కొమ్రన్ననే పిలుస్తారని వీడి ఉపాయం అని అర్దమై నాలో నేనే నవ్వుకున్నా.ఆ ముసలోన్ని చితి మీద కాలుతుంటే ఉండబట్ట లేక "కొమ్రాన్నా ఆ ముసలోడు ఆ రోజు నీ చెవ్వుల ఎదో చెప్పిండు గదేందే?" అని అడిగిన, అప్పుడు చిన్నగా నవ్వుతు "నీ జీతం కంటే ఎక్కువ పైసలు ఒక్క గంట సేపట్ల రాజుల గుడి కాడ దొరుకుతాయి రా "అన్నడు. మరునాడు మేనేజరు అచ్చి మల్లన్న తో ఎదో మాట్లాడుతుంటే, నేను కొమ్రన్నను  చూసి ఎమన్నా మళ్ళా నీకు ఎసరు పెడుతండా ఏందీ మల్లిగాడు ? అంటే ఆని చెయ్యి ఎప్పుడో దాటి పోయింది లేరా అన్నడు. "మరి ఎట్టా ఉంది మన కొత్త మేనేజరు ఎవ్వారం" అని అడిగా. కొమ్రన్న మీసాల మీద వేళ్ళతో రాస్తూ ఇప్పుడిప్పుడే తెల్లగయ్యే కొద్ది రంగేస్తున్న, కొన్నొద్దులైతే నల్లవడుతై అన్నడు. అలాఅచ్చిన కొత్త మేనేజరు కల్లా కొమ్రన్న కొత్త రంగు ఏసుకుంట వాడి పనిని కాపాడుకుంట ఉన్నడు.

20150731

డైరీ లో కనిపించని ఒక పేజీ

డైరీ లో కనిపించని ఒక పేజీ

ఈ మద్య రేపు లు గీపు లు అని వింటుంటే నాకు నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. మూడు నాలుగు సంవత్సరాల క్రితమే... అప్పుడు నేను ప్రేమలో ఉన్నాను. అందర్లానే నేనూ ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతూ కలిసి నప్పుడు కష్టం మీద ఒక ముద్దు ఇచ్చేదాన్ని. ఒకసారి తను వాల్లింటింకి రమ్మన్నాడు. ఇంట్లో ఎవరూ ఉండట్లేదు, అందరు పెళ్ళికి వెళ్తున్నారు అని. నాకు వాడి పై ఉన్న నమ్మకమో ఇష్టమో కాదు రెండూ నన్నువాడి మాట వినేలా చేసాయి. చీకట్లో వెళ్తే ఎవరూ ఉండరని రాత్రి బయలు దేరాము. ఇంట్లోకి వెళ్ళగానే వాడు డోర్ లాక్ చేసి నన్ను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టడం స్టార్ట్ చేసాడు. కాసేపటికి తేరు కుని "రేయ్ ఎం చేద్దాం చెప్పు 'అని ఎం చెప్పక ముందే 'టీ చేస్కుందాం అని చేయి పట్టుకుని కిచెన్ లోకి తీస్కెళ్ళాడు. నాకు పాలు చెక్కర చాపత్త ఇస్తే నేనే టీ పెట్టాను. అది మరిగేదాకా వాడు నన్ను వదల్లేదు. టీ ని కప్ లో పోస్కుని సిప్ సిప్ కి కప్ మార్చుకుంటూ తాగేసాం ... నన్ను ఒప్పించి నాతో చీర కట్టించి, కష్టంగా సింగులను మడత పెట్టి చెక్కిండు.
 కనీసం చీర కట్టినంత సేపన్నా దాన్ని నా ఒంటి మీద ఉండనివ్వలేదు. ఎక్కడో పుస్తకాలల్లో చదివాడట ఫోర్ ప్లే మంచిదని, ఒళ్లంతా తడిపెసాడు. మేమిద్దరం ముందుగానే అనుకున్నాం అంత కంప్లీట్ చేద్దాం అన్నీ చేస్కుందాం  అని . అలా ప్రయత్నించినా నాకు ఎందుకో అనుకూలంగా అనిపించలేదు. 'వద్దు లేరా' అని చెప్పాను. "ఇంత దూరం వచ్చి ఇలా అంటే ఎలారా " అని అన్నాడు. ఆ మాట వినగానే నాకు విపరీతమయిన కోపం వచ్చింది. వెంటనే అక్కడి నుండి లేచి పక్కకి వచ్చి పడ్కున్నా. ఇంత దూరం వస్తే మాత్రం ఇలా చేయాలనీ రూల్ ఉందా ?
వాడే నా పక్కకి వచ్చి సారీ చెప్పి వాడికి తెల్సిన, వాడికి నచ్చిన చోట హాగ్ చేస్కుంటూ ముద్దులు పెడుతూనే ఉన్నాడు, ఒక్క క్షణం కూడా నా చెయ్యి విడవ లేదు, తండ్రి లేని లోటు ను వీడు తీర్చగలడన్న నమ్మకం తో  నిద్రలోకి జారుకున్నా. పొద్దున్నే బస్టాండ్ చేరుకున్నాం. ఆ సూర్యుని కిరణాల వల్ల పడే మా నీడల్ని చూస్కుని మేడ్ ఫర్ ఈచ్ అనుకున్నాం. అప్పుడు వాడడిగాడు "రాత్రి అంతలా ఫీల్ అయ్యావ్ ఎందుకు" అని. "మరి కారా ఇంత దూరం వచ్చాక అంటే ఏంటి అర్ధం ? నేను మీ ఇంటికి వచ్చా అని లోకువ ఐపోయనా ? "అని గట్టిగా అడిగా. దానికి వాడు "హయ్యో అలా కాదురా అంతవరకూ ప్రయత్నించి మద్యలో ఆపెయ్యడం ఎందుకు ఇంకోసారి ప్రయత్నిద్దాం అని అన్నాను" అన్నాడు.' అంతేనా, నేను అలా అన్కోలేదు రా తప్పకుండ చేయాల్సిందే అని ఒత్తిడి తెస్తున్నావ్ అనుకున్నా' అని సారీ చెప్పాను. వాడిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు, నిన్న నాతో ఎలా ప్రేమగా ఉన్నాడో ఇప్పుడు నాతో అలానే ఉన్నాడు, ఎదో జరగాల్సింది కూడా జరిగితే బాగుండు అన్న భావం కూడా వాడిలో లేదు. నన్ను బస్సు ఎక్కించి వాడు పెళ్లి కి వెళ్లి పోయాడు. కానీ నా మనసు మనసు లో లేదు, ఒక రోజు తరవాత నేను మల్లి వాడికి కాల్ చేశా, రేయ్ నువ్వు రేపు రారా . చేసేద్దాం ఇంకా ఫోర్ ప్లే ఏం వద్దు అన్నాను . "తప్పదా ?" అన్నాడు . ఈ మాట విన్నాక నాకు మతి పోయింది. ఏంటి నేను రమ్మంటే తప్పదా అంటాడు? అయినా నేను మారు మాట్లాడకుండా 'తప్పదు' అన్నాను. అలా అనేంత చనువు ఇష్టం హక్కు అన్నీ నాకు వాడి పై ఉన్నాయి. "చిన్నూ మనం మళ్ళీ కలవొచ్చురా, కాని ఈ పెళ్లి ఈ ఎంజాయ్ మిస్ అవుతే మళ్ళీ రావురా" అన్నాడు. అయినా ఖరాకండి గా నేను చెప్పేసరికి కాదనలేక పోయాడు. నా దగ్గరకు వచ్చాడు , వాడిలో ఎలాంటి ఎక్సైట్ లేదు, ఎదో కొత్త అనుభూతి పొందబోతున్నా అన్న ఆనందం కనపడక పోగా ఫోన్లో ఎవరితోనో నేను కూడా ఉంటె బాగుండు కదా అంటున్నాడు. నాకు మాత్రం అలా లేదు, ఎదో ఇస్తున్నాను అని ఆనందంగా ఉంది. ఇది కోరిక అనుకుంటే పొరపాటే. నా అనుకున్న వానికి నేను ఇవ్వగలిగే సంతోషం లో ఒక భాగం మాత్రమే ఇది. చెట్టు చిటారు కొమ్మ వరకు కలిసి ఎక్కాలనుకున్న చిన్ని ఆశ అంతే. అంతకు మించి ఏదీ కాదు. మొన్నటి కంటే ఈరోజు కాస్త ఆలస్యం అయింది ఇంటికి చేరే సరికి . ఆకలి గా కూడా ఉంది. ఇద్దరికీ సరిపడా అన్నాన్ని వండేసాం. ఎగ్ కర్రీ చేద్దాం అంటే నోరు వాసన వస్తుంది వద్దని నేనే చెప్పాను. ఇంట్లో ఉన్న మామిడి కాయ పచ్చడి ని, వేడి వేడి అన్నాన్ని ఒకే ప్లేట్ లో వేసి ఊదుకుంటూ హాల్ లోకి వచ్చాడు. నా ఎదురు గా కూర్చుని కలిపి ఒక ముద్దా నా నోటికి అందించాడు. రెండో ముద్ద వాడు తినబోతుంటే ఆపి నేనే తినిపించా. అసలు మేము ఇక్కడికి వచ్చింది తినిపించుకోడనికా ? సమయమంతా వృధా అవుతుందని నాకు అనిపిస్తున్నా, వాడు మాత్రం నిదానంగా తినిపిస్తునే ఉన్నాడు. అంతలో నా పెదవి పైన ఒక అన్నం మెతుకు ఆగింది, దాన్ని నేను చేతితో తీసే లోపే వాడు పెదాలతో అందుకున్నాడు. ఎంతైనా నా జాన్ రొమాంటిక్ ఏ. నీళ్ళతో నా చేతిని కూడా వాడె కడిగేసి ప్లేట్ పక్కన పెట్టేసాడు. ఇంకా ఈరోజు చీర కట్టడాలు ఏమీ లేవు . డైరెక్ట్ గా ఆక్షన్. సక్సెస్ తర్వాత ఇంకో పది నిముషాలు రొమాన్స్ సెకండ్ అట్టెంప్ట్ సక్సెస్ . వెంటనే వాడు అటు తిరిగి రెండు నిమిషాల్లో నిద్రపోయాడు పిలిచినా పలకనంతగా . అలా చేయకూడదని వాడికి తెల్సు అని నాకు తెల్సు , కానీ వాడికి నిన్న పెళ్లి లో రాత్రి నిద్ర లేదన్న సంగతి నాకు చెప్పాడు , అంతే కాకుండా ఎక్కువ ప్రయాణం వల్ల మరీ అలసి పోయి వెంటనే పడుకున్నాడు.
మళ్ళీ ఉదయమే 4 గంటలకి లేవాల్సి రావడం తో వాడికి ఆ రెండు గంటల నిద్ర కూడా సరిపోయినట్టు లేదు. ఆటో లో బస్టాండ్ కి. సమాజం ఆడే ఒక వింత నాటకం లో మేము దూరం అవ్వాల్సి వచ్చింది. నాకు పెళ్లైంది మా కులపోని తో, ప్రస్తుతం నాకో పాప. కానీ ఈ మద్య రేపుల గురించి విన్నప్పుడల్లా నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయి. నేను వాడి దగ్గరికి వెళ్లి ఆ దగ్గర లో చాలా దూరం వెళ్లి వద్దు అనగానే క్షణికావేషానికి లోను కాకుండా ఆగి పొయ్యే మగాళ్ళు కూడా ఉంటారా అని ...
(ఒక స్త్రీ చెప్పిన యదార్థ ఘటన ఆధారంగా )

20150604

దశాబ్దాల ఆవిర్భావాలు

నాకు తెలీకుండానే 
నా దేహం లో మరో ఆత్మ దాగుండేది. 
నాకు తెలీకుండానే 
నా నోరు వాని గొప్పదనాన్ని పలికెది. 
  కాలం అంతా కలల్లోనే గడిచేది. 
నన్ను నేను తెలుసుకున్నప్పుడు 
నా దేహాన్ని నేను తనివితీరా తడుముకున్నప్పుడు 
కళ్ళల్లో కరిగిన కళలకానాచినంతా
మాగానాలల్లో చల్లుదామంటే
నాకు తోడుగా ప్రపంచమంతా ప్రతిజ్ఞ పూనింది. 
పయనించే ఆరాటం లో 
ఎక్కడో ఓ అక్షరం 
మరింత బలాన్నిచ్చేది 
ఎక్కడో ఓ పిలుపు 
మరింత ఉత్సాహాన్నిచ్చేది. 
ఎక్కడో ఓ మరణం 
కన్నీటి శిలా శాసనాన్ని ముద్రించేది. 
రాజకుమారుల రాసలీలలు 
ఉద్యమ శిఖరాలను 
చిటికెలో చిదిమేసినప్పుడు 
మేఘాల్లా వచ్చిన వార్తలు 
వర్షించకుండా వెళ్ళినప్పుడు  
మనస్సేంతగా కృంగిపోయిందో ?
నిప్పు మింగి నిలువునా తగలబడి 
మహోద్యమాన్ని వెలిగిస్తున్నప్పుడు 
ఆ తల్లి పేగు ఎంతలా తన్లాడిందో?
తల లో తుపాకి గుండు పేల్చుకుని 
అమరత్వాన్ని  ఎగరేస్తూ ... కిష్టన్నా ... 
నువ్వు నేలకొరిగినప్పుడు 
ఆ పుస్తెలెంతగా గింజుకున్నయో ?
రాలిపోయిన మీ రూపాలను 
ఎన్ని  హృదయాలు దాచుకున్నాయో ?
నన్ను నన్నుగా నిలపాలని
ఎన్ని గొంతుకలు తపించాయో ?
విజయాన్ని తీరాన వదిలేసి
అలల్లో కలిసిన అమరులారా,
కరిగిపోతున్న కాల ప్రవాహం లో
దశాబ్దాల ఆవిర్భావాలు కొట్టుకుపోవచ్చుగానీ
ఈ మట్టి నేర్పిన త్యాగాలకు
అనుభవించే స్వేఛ్చా తీరాలకు
మీరే సజీవ సాక్షాలు...

20150503

ఆ అయిదు రోజులు


ఆ అయిదు రోజులు 

జారి పడని అండాల కండల్ని మేస్తూ
ఎదిగిన వాళ్ళే
పచ్చి బాలింతల రొమ్ముల్లో
పాలు తాగిన వాళ్ళంతా
ఏపుగా పెరిగి వేదవవాదాలు వాదిస్తూ 
పడదని పట్టరాదంటున్నారు .
ముట్టుడని ముట్టరాదంటున్నారు.
పొత్తి  కడుపులో భద్రంగా దాక్కుని
స్వేచ్చ గా పైకి ఎగిరినవాళ్ళే
సంకెళ్ళు వేస్తూ వేదిస్తున్నరు.
కటీ వలయపు కష్టాన్నంతా
పంటి బిగువన భరిస్తూ
రూపు దాల్చని
ఓ నిర్వీర్యపు కణాన్ని
తన్లాడుతూ తనువు నుండి
స్రావంగా వదిలేస్తే
తోడుండాల్సిన వారే
అందకారపు విశ్వాసాలు
అల్లిన కుచ్చుల్లో
పెంకాసు కుప్పలు పోసి నడిపిస్తున్నారు
సిసలు రోజుల్లో
అసలు మనిషినే కానట్టు
కాలు కదపడమే నేరంగా
మాట ఎత్తడమే
మహా పాపం అయినట్టు
పేరు చెప్పితే పరువే పోయినట్టు
మాస మాసానికి మనసుకి
మరణ శిక్షే విదిస్తారెందుకు ?
మొక్కుతున్న దేవుడైనా
రాలి పడని రక్తపు బిందువే
అది ఉత్పత్తికి మూలం అయిన
పవిత్ర హోమం అని
మీకు అర్దమయ్యేదెప్పుడు ?
ఆ అయిదు రోజుల్ని
అర్ధం చేసుకునేదేప్పుడు ?
 

20150417

మొలతాళీ ...

మొలతాళీ ...


మనం కొన్ని విషయాలు వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుకుందాం .

మహిళల మంగళ సూత్రాల మీద పెద్ద చర్చ, సరే ఆ తాళి కి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు దాన్ని ధరించాల్సిన అవసరం కూడా అంతగా లేదు. మరీ ఈ విషయం ఒక మహిళలకే చెందినదా అంటే ? అదీ కాదు అలాంటివి ధరిస్తున్న మగవాళ్ళు ఉన్నారు. కాకపోతే నడుము దగ్గర, మొలతాడు లాగా ...

దీన్నిగురించి నేను తెల్సుకునే ప్రయత్నం చేసినప్పుడు విచిత్ర మైన అబద్దపు నిజాలు బైట పడ్డాయి. అందులో
మొదటిది మొలతాడు ధరించిన మొగవాడు ఎత్తు పెరుగుతారు అని అయితే
రెండవది శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుందని.

ఒకవేళ గనక మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే సాధారణ భారతీయుని ఎత్తు అయిదు అడుగుల అయిదు అంగుళాలు. మొలదారాలు ధరించని సుడాన్ దేశస్తుల సగటు ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు, ఒకరకంగా మనది ప్రపంచ సగటు ఎత్తు కన్నా తక్కువే.
అంటే ఎత్తు విషయం లో మొలదారం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

రెండో విషయం లో సగటు భారతీయుని శృంగార సామర్థ్యం నలుగు నుండి ఆరు నిమిషాలు. ప్రపంచ సగటు మాత్రం ఆరు నిమిశాల ముప్పయి సెకన్ల కంటే ఎక్కువే. అంటే శృంగార పరంగా కూడా మొలదారం ఉపయోగ పడదు. ఇది పక్కా.

అలాంటప్పుడు ఈ మొలదారం మన జీవితం లోకి ఎలా ప్రవేశించింది అనే అంశాన్ని పరిశీలిస్తే, మానవుడు రాతి యుగం నుండి ఇనుప రాతి యుగం లోకి అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయం లో రెండు వేరు వేరు రకాలైన ఆయుధాలను వేటకోసం ఉపయోగించే వాడు. అలాంటి సమయం లో ఆయుదాలని చేతిలో పట్టుకోడం ఇబ్బంది గా అనిపించి నడుముకో, బుజానికో కట్టుకునే వాడు. వేటాడిన జంతువులను కాల్చుకునెందుకు ఈ తాడు ఉపయోగపడేది. అలా ఉపయోగ పడే వస్తువులను తన దగ్గరే ఉంచుకునేవాడు ఇప్పుడు సెల్ ఫోన్స్ లాగ.  ఈ తాడు జననాంగాలు కనపడకుండా కప్పుకునే వస్త్రాలను, ఆకులను కట్టి ఉంచడానికి కూడా ఉపయోగపడేది. ప్రస్తుతం అలాంటి అవసరాలను బెల్ట్ తీరుస్తుంది అనుకోండి. అందుకే ఆలోచన కలిగిన మనుషులు ఈ ఉపయోగం లేని తాడును కొన్ని వందల సంవత్సరాల క్రితమే మానేసారు.

భారతీయుల విషయం లో ఇలా జరగక పోడానికి కారణం లేకపోలేదు. ఆ కాలం లో రాజుల రధాలు, గుళ్ళు గోపురాలు నిర్మించడానికి రాళ్ళు ఈ నడుము కూ కట్టిన తాడు తోనే లాగాల్సి వచ్చేది.

అలా మనం మహిళలకి ఎలా మంగళ సూత్రాలు, మగాళ్ళకి  మొలతాడు కట్టేశాం. ఇప్పుడు మన దేశం లో మంగళ సూత్రం లేని మహిళ విధవ లా గుర్తించబడితే మొలతాడు లేని వాడు మగాడే కాదన్నట్టు   పరిగనించబడుతుంది. 

ఇంకా మనం మన బానిస గురుతులని చెరిపెయ్యడానికి కూడా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం. మనం ఇంకా ఎందుకు భ్రమల్లో బతుకుతున్నామంటారు ?
సోము రోగాపోడు మేడలో బిళ్ళ వేసుకున్నట్టు మనం కూడా మొలతాళీ  దరించాల్సిందేనా ?

Ramprasad 8897868747

20150406

ఎగిరే పతంగికి

ఈడొచ్చిందని
ఈడొచ్చి ఆడొచ్చి
జోరీగల్లా జాడవెదికి
వేదపండితుల వేదిక సాక్షిగా 
ఎగిరే పతంగికి
రెక్కలు విరిచి
నచ్చకున్నా దారపు కండెలు కట్టేసిన్లు .
బేరమాడి కొనిచ్చిన బలవంతపు బహుమానం,
నా జీవితం లోకి ప్రవేశించిన అంధకారం
నన్నడక్కుండానే నాలోకి ప్రవేశించాడు.
నిండుకున్న పాలగిలాస తో
కట్టుకున్న పునాదులు కూలిపొయ్యి
అశ్రువులు గా స్ఖలిస్తే,
ఆ కన్నీటి ఊటని చూసినప్పుడల్లా
దేహం పై గెలుపొందానన్న గర్వం
వాడి మొహం లో కొట్టోస్తుంది.
ఆ రాతి గుండెకేం తెలుసు అవి
ఓటమి లో ఒలికిన అవశేషాలని.
 చదువు కున్న పుస్తకాలన్నీ చెదలెక్కి
మట్టిలో కలిసి పొయ్యేసరికి
నెత్తుటి ముద్దలు తోడుకుంటూ
మరో శిశువు ప్రాణం పోసుకుంది.
ఇప్పుడు నేను తల్లిని మాత్రమే కాదు
ఆశల సమాధి మీద నిద్రిస్తున్న           
విధవ ను కూడా ...                           

20150218

అమర కార్మిక

వాడు దేశం కోసం
భూమి పొరలతో
కొట్లాడుతున్న సైనికుడు. 
ఒంటి చేత్తో
సముద్రాన్ని ఆపుకుంటూ,
తొంట చేత్తో
బయటకు  బొగ్గును లగేస్తున్నడు.
అంతకంతకూ కూరుకు పోయే బతుకు,
అయినా దీపం కోసం వత్తిని పేనుతనేఉన్నడు. 
ప్రతిక్షణం
ప్రకృతి తో యుద్ధం చేస్తూ,
మేలిమి బంగారాన్ని వడుకుతున్నడు.
 గంట గంట కు పెంచే
ఉత్పత్తి లక్ష్యానికి,
ఊపిరి తిత్తులను రక్షణగా నిలిపి
లోడు లాడీసు ను గుంజుతున్నడు.
నరకబడ్డ శరీర భాగాలు ,
మాంసపు ముద్దలు రుద్దుకున్న
బొగ్గు పొరలు ,
రక్తం తో పేరుకు పోయిన
భూగర్భ గనులు.
ఓ వైపు ఉబికి వచ్చే ఊటలు
హటాత్తుగా తరుముకొస్తుంటే,
ధైర్యం గా బొగ్గుపెల్లను ముద్దాడి,
నీటి ప్రవాహం లో ఆవిరై, 
అమరత్వం పొందిన వీర జవాన్లు. 
ఉత్పత్తి లో ఊపిర్లు వదిలిన 
నవ జాతి రతనాలు . 
ఈ దేశం మీకు మూడు రంగుల 
జెండా కప్పక పోవచ్చు . 
మీ వీరత్వాన్ని వినిపిస్తూ 
ఏ తుపాకి గొట్టం పేలకపోవచ్చు. 
మీ శౌర్యానికి ఏ పతకమూ 
మెడలో వాలకపోవచ్చు . 
మీ పేర్లు ఏ శిలా ఫలకం మీద 
లిఖించబడకున్నా ,
 కార్మికుల మనో ఫలకాలమీద 
ఎప్పుడూ మారుమోగుతనే ఉంటాయి. 
ఎర్ర బుగ్గలు, ఎల్ ఇ డి బల్బులు మిమ్మల్ని 
ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉంటాయి . 
నిలిచినా మీ శ్వాసలు 
పంఖల రెక్కల్లో 
మాకు ఊపిర్లు పోస్తునే ఉంటాయి . 
   -----గని ప్రమాదాల్లో అమరత్వం పొందిన కార్మికులకు ...

20150120

అమాస ...

అమాస ...
ఒక్కసారి వచ్చి పో ,
ఈ పడు వెన్నెల్లో
వెలిగే మచ్చల మొహాలను
చూడలేకున్న .
నీ నవ్వు లేని ఆ మాసపు పూటల
వెలుగుల్లో ఎంత వెలితి కన్పించిందో ?
అమాస,
నీ చీకటిని
ఇక్కడ పదిలంగా వదిలిపో,
ఎవడో అమాంతం పగలగొట్టి
వెలుగులు పారియ్యజిక్క,
ఈ దారిద్ర్యపు దాసోహాన్ని
భరించలేకున్న .
అమాస
ఇక్కడే
ఇక్కడే ఉండిపో,
మనుషుల మద్యనే
శాశ్వతంగా నిలిచిపో,
ఈ సమాజం అప్పుడప్పుడు
నిన్ను దీపాలతో చంపేయవచ్చునేమో
నాకోసమైన నువ్వు ఏమాత్రం చెదిరిపోకు. 
చచ్చు బడిన ఈ దేహపు స్పర్శ
తిరిగి పరిమలించేదాకా,
మా నయనాల ప్రాధాన్యం
నిర్వీర్యం అయ్యేదాకా ఇక్కడే దాగుండిపో. 
ఈ వస్తు వ్యామోహ ప్రపంచాన్ని
పూర్తిగా మసకబారించి పో ,
కాంతిని కామించే కుళ్ళు కళ్ళని
పూర్తిగా పూరించిపో ,
 జాతుల మద్య తారతమ్యాలను
మటుమాయం అయ్యేదాకా నిలిచిపో ,
నీతోడు
నీకు తోడుగా
నా శక్తి మేరకు
సూర్య చంద్రులతో యుద్ధం చేస్తూనే ఉంటాను .
 

20150111

ధనం ధనం

పల్లవి "     ధనం ధనం ఇది తరం తరం
                నిరంతరం ధనం ధనం
ఊటే ఉనికై , చెలిమే చెలివై , చేరువై నిలిచి                  "చరణం "        
నిచ్చెన వేసి నింగికి పాకి మేఘం నింపి
నిచ్చెన విరిగి నిలువున ముంచి చెరువే కరువై
చెలిమే చెరచి ఊటే ఇనికి పరువే తీసే                          ''పల్లవి '' 

అక్కరకు వచ్చి అప్పుగ మారి                                     "చరణం "
అరుదుగ దొరికి బిరుదుగ ఎదిగి
కొంతకు కొంతై అంతకు అంతై
ఎవరూ మోయని అసలే తీరని                                     పల్లవి

కష్టం జీతం పెడితే లాభం పోతే నష్టం                             "చరణం "
ఒకడికి కేకు ఒకరికి మేకు
ఒకరికి కాదల్ ఒకరికి కాజల్
కావల్సిందోకటేరోయ్
దగ్గరకు రాని ధనం  ధనం...                                        పల్లవి

వేటకు పూట ఆటకు ఆట                                           "చరణం "
చేతులు మారి చేష్టలు మర్చి
అందరు ఆడేదొకటే మాట  ధనం  ధనం                          పల్లవి

దొరకని దారిలో బాటలు వేసి                                         "చరణం "
బాటసారులను ఇరుకున పెట్టి
కిరికిరి చేసి కిడ్నాప్ చేసి
కంచికి చేరని కథనే ఇదిరా ధనం ధనం                          పల్లవి

జీవం లేని రెమ్మలు ఎగిరి                                            "చరణం "
నవ్వే బొమ్మలు జాతర జేరి
నంబరు కమ్మలు నమిలే ఆటర ధనం ధనం                పల్లవి 

20150107

అంబేద్కర్ గుండెల మీద

ఎన్నో ఏండ్లు గా దాచిపెట్టిన
దారిద్ర్యమది అంబేద్కర్
దళిత వర్ణానికింకా నిర్లక్ష్యపు
సోగాసులద్దుతూనే ఉన్నది
నేర్పేవాడే లేనప్పుడు
నేర్పరి కొరకు రాయితీల జాతర లెందుకోయ్ ?
బహుషా ఆనాడు సాధించిన స్వాతంత్ర్యం
వట్టి మట్టి కోసమేనేమో భీం : అందుకే
ఆ తల్లి కడుపున వాడింకా
బానిస గానే పురుడు  పోసుకున్నడు.
బహుజన స్వాతంత్ర్యానికి మరోయుద్దం
మిగిలే ఉండదని ఊహించడం మరిచావేమో ?
వెలుగులు పంచే వెన్నల కోసం ఎంత వేగంగా వెదికినా
రాలిన తారలే తారస పడుతున్నరు .
సైందవులను జయించాలని చూసిన ప్రతి సారి
నీ చూపుడు వేలు బౌద్ధాన్ని జపిస్తుంది బాబా సాహెబ్.
నువ్వు ఒరిగితే ఓదార్చిన ఆ చెట్టే
అగ్రవర్ణ హరితం తో ముసలిదై మూలుగుతంది.
ఆనాడు పెట్టిన అద్దాల వన్నె తగ్గింది బీ. ఆర్.
పాతవి మార్చి కొత్తదారి చూపవోయ్ .
అవమానపు అనుమానాలేర్పడకుండా వేసుకున్న
ఆ నల్ల కోటిప్పుడు మురుగు కంపు కొడుతుంటే
నువ్విప్పుడుండాల్సింది ఆ రహదారి గద్దెల మీద కాదు అంబేద్కర్ ,
పీతిగొద్దెల మీద బతుకులీడుస్తున్న నా తమ్ముల గుండెల మీద...    

20150101

అపర వార్తా సంజీవనీ

బడి కంటే ముందే
పోద్దటి బదిలీ పొయ్యిన అయ్య
బడి ఇడిసినంక గూడ రాకపోతే
అమ్మా నాన్నెక్కడేనంటూ
జబ్బకేసిన బ్యాగును ఇసిరేసి
  ఏమైందో ఇంత ఆల్షం ఆయే నని
బాయి కాడికి ఉరికిన
చిన్నారుల పాదాలు .
లోడాసు నెక్కరు, నెత్తిన సేఫ్టీ ల్యాంపు
చినిగిన బూట్లతో బడిపోరని లెక్క
ఆయాసం నిండిన దేహం
చెమట నిండిన బనీను
మసి నిండిన ముఖాన్ని
బట్టల సబ్బుతో పెయ్యి రుద్దుకుంటండు.
చెమర్చిన చేతులతో
మరో ప్రాణాన్ని తాకితే
గుండెల నిండిన బరువంతా
ఒక్కసారి దిగినట్టుంది.
ఈడికేందుకచ్చినవ్ రా ?
అని గద్దరించిన ఆ గద్దరింపు లో
తండ్రి రెక్కల కష్టం
పిల్లానికి తెల్వద్దనే తపన మాత్రం
గొంతులో దాగింది.
తెగిన రెక్కకి ప్రాణం ఊది పంపినట్టు
ఎగురుకుంటూ, కాలరెగిరేసుకుంటూ
నానమ్మ నాన్నత్తండే అని చెప్పిన మాట 
ఓ అమ్మ ప్రతీ రోజు వినాలనుకునే
అపర వార్తా సంజీవనీ  ...