20150503

ఆ అయిదు రోజులు


ఆ అయిదు రోజులు 

జారి పడని అండాల కండల్ని మేస్తూ
ఎదిగిన వాళ్ళే
పచ్చి బాలింతల రొమ్ముల్లో
పాలు తాగిన వాళ్ళంతా
ఏపుగా పెరిగి వేదవవాదాలు వాదిస్తూ 
పడదని పట్టరాదంటున్నారు .
ముట్టుడని ముట్టరాదంటున్నారు.
పొత్తి  కడుపులో భద్రంగా దాక్కుని
స్వేచ్చ గా పైకి ఎగిరినవాళ్ళే
సంకెళ్ళు వేస్తూ వేదిస్తున్నరు.
కటీ వలయపు కష్టాన్నంతా
పంటి బిగువన భరిస్తూ
రూపు దాల్చని
ఓ నిర్వీర్యపు కణాన్ని
తన్లాడుతూ తనువు నుండి
స్రావంగా వదిలేస్తే
తోడుండాల్సిన వారే
అందకారపు విశ్వాసాలు
అల్లిన కుచ్చుల్లో
పెంకాసు కుప్పలు పోసి నడిపిస్తున్నారు
సిసలు రోజుల్లో
అసలు మనిషినే కానట్టు
కాలు కదపడమే నేరంగా
మాట ఎత్తడమే
మహా పాపం అయినట్టు
పేరు చెప్పితే పరువే పోయినట్టు
మాస మాసానికి మనసుకి
మరణ శిక్షే విదిస్తారెందుకు ?
మొక్కుతున్న దేవుడైనా
రాలి పడని రక్తపు బిందువే
అది ఉత్పత్తికి మూలం అయిన
పవిత్ర హోమం అని
మీకు అర్దమయ్యేదెప్పుడు ?
ఆ అయిదు రోజుల్ని
అర్ధం చేసుకునేదేప్పుడు ?
 

No comments:

Post a Comment