20150604

దశాబ్దాల ఆవిర్భావాలు

నాకు తెలీకుండానే 
నా దేహం లో మరో ఆత్మ దాగుండేది. 
నాకు తెలీకుండానే 
నా నోరు వాని గొప్పదనాన్ని పలికెది. 
  కాలం అంతా కలల్లోనే గడిచేది. 
నన్ను నేను తెలుసుకున్నప్పుడు 
నా దేహాన్ని నేను తనివితీరా తడుముకున్నప్పుడు 
కళ్ళల్లో కరిగిన కళలకానాచినంతా
మాగానాలల్లో చల్లుదామంటే
నాకు తోడుగా ప్రపంచమంతా ప్రతిజ్ఞ పూనింది. 
పయనించే ఆరాటం లో 
ఎక్కడో ఓ అక్షరం 
మరింత బలాన్నిచ్చేది 
ఎక్కడో ఓ పిలుపు 
మరింత ఉత్సాహాన్నిచ్చేది. 
ఎక్కడో ఓ మరణం 
కన్నీటి శిలా శాసనాన్ని ముద్రించేది. 
రాజకుమారుల రాసలీలలు 
ఉద్యమ శిఖరాలను 
చిటికెలో చిదిమేసినప్పుడు 
మేఘాల్లా వచ్చిన వార్తలు 
వర్షించకుండా వెళ్ళినప్పుడు  
మనస్సేంతగా కృంగిపోయిందో ?
నిప్పు మింగి నిలువునా తగలబడి 
మహోద్యమాన్ని వెలిగిస్తున్నప్పుడు 
ఆ తల్లి పేగు ఎంతలా తన్లాడిందో?
తల లో తుపాకి గుండు పేల్చుకుని 
అమరత్వాన్ని  ఎగరేస్తూ ... కిష్టన్నా ... 
నువ్వు నేలకొరిగినప్పుడు 
ఆ పుస్తెలెంతగా గింజుకున్నయో ?
రాలిపోయిన మీ రూపాలను 
ఎన్ని  హృదయాలు దాచుకున్నాయో ?
నన్ను నన్నుగా నిలపాలని
ఎన్ని గొంతుకలు తపించాయో ?
విజయాన్ని తీరాన వదిలేసి
అలల్లో కలిసిన అమరులారా,
కరిగిపోతున్న కాల ప్రవాహం లో
దశాబ్దాల ఆవిర్భావాలు కొట్టుకుపోవచ్చుగానీ
ఈ మట్టి నేర్పిన త్యాగాలకు
అనుభవించే స్వేఛ్చా తీరాలకు
మీరే సజీవ సాక్షాలు...