20141205

చెత్త పిలగాడు

చెత్త పిలగాడు 

వాడిపడేసిన మల్లె మొగ్గలు
తన స్పర్శ తో తిరిగి పరిమళిస్తాయి .
ఆ చేతి అయస్కాంత మహిమో మరేమో
విహరించె వరుకులన్నీ వాడి చెంత చేరాయి .
ఏ సాధనం లేని సౌందర్యం
 దుమ్ము తో ఆ మొహం చిగురిస్తుంది .
మనం బతికున్నంత వరకు
వాడు మనల్ని బతికించడానికే
 బతుకులీడుస్తడు .
ప్లాస్టిక్ వద్దంటూ ఫ్లెక్సీ ల్లో కన్పించే
 నినాదాలన్నీ వాడి సంచి లో నిండిపోయాయి.
మోసపోయిన ప్రియుల విరహ గీతాలు
వినిపించే విరిగిన సిమ్ములూ
చీకట్లో చల్లిన వర్షాలకు చిద్రమైన గొడుగులు
తడిచి ముద్దైనా తప్పక తొలగిస్తాడు వాడు.
చెప్పులు లేని కాళ్ళు
గూడలు తెగిన ఎంతమంది కుళ్ళును మోస్తుందో
సమయ పాలనైనా సాంఘిక పాలనైనా
వాన్ని చూసే నేర్చుకోవాలెవరైనా
ఏ కాగితము చెత్త కాదు ,
అది వాన్ని చేరాలనే చిత్తూ గా మారుతుందేమో ?

నిద్రించే ఒక రాత్రి ఆ చెత్తే వాని మెత్తని పరుపు ,
చలేసే మరోరాత్రి ఆ కవర్లే వెచ్చని దుప్పట్లు,
వానొచ్చే ఇంకోరాత్రి ఆ సంచే వాని పిట్ట గూడు,
నిద్దుర లేచి జబ్బ కేసే ఆ మూటే వాడి టెడ్డి బేర్ .
ఇప్పుడు వాడు మోస్తున్నది చెత్త బుట్ట కాదు
సమస్త జనుల పాపాల కుప్ప . 

He row in

He row  in  

తెర మీద నాజూగ్గా కన్పిచే శరీరం
తెర వెనుక ఎంత చిద్రమైందో ?
ఆట లో కత్తిరించకుండా
తన దేహాన్ని కత్తిరించుకుంటే,
ఇంచు ఇంచు కు రేటు కట్టి ,
అంగాంగాన్ని ఆస్తులుగా అమ్ముకునే  నిర్మాత.
తన  దేహం ఒక మర్రి చెట్టు .
వాలిపోయే ప్రతీ మగాడు
తన దృష్టి లో పిట్ట రెట్టే ,
వాసనా మత్తులో మునిగి
లొట్టలేసుకుంటూ చూసేదే వీక్షకులు.

క్లాప్ కి ముందు ప్రతి వాని
పక్క చేరితే గానీ
కథకు కథానాయిక కాలేని తను
మనకు తెరపై కన్పించేది
తనువు మాత్రమే ,
మేకప్ వేస్కునే ప్రతీసారీ
మనసుకు మత్తు మందిస్తుంది.
ఇరువైనాలుగు రాత్రుల్లో
రక్కిన గాయాలు కన్పించకుండా
కాస్మోటిక్స్ తో ముఖానికి నవ్వు ను
అతికించుకున్నది హీరోయిన్ కాదు
he row  in  

20141201

కుష్టు రోగం

అతి పెద్ద ప్రజాస్వామ్యం లో
పార్టీలన్నీ చేతులు కల్పాయి
దేశాన్నెలా దోచుకోవాలా అని.
ఓటేస్న పోటు గాన్ని పట్టి మరీ
చూపుడు వేలుకు చుక్కనంటిచ్చారు.

వేస్న ఓటు గెల్చినోడ్కి దాసోహం అయ్యింది ,
అంటిన చుక్క అంతకంతకు పెరిగి
కుష్టు రోగం అయింది.

కార్పోరేట్ గద్దలన్నీ
పిక్కల్లో మాంసాన్ని పీక్కుతిన్నా
చచ్చు బడిన శరీరానికేం తెలుస్తుంది.

గుండెల్లో గునపాల్ని దించి
రక్తాన్ని పిండేస్తు , కాషాయాన్ని  ఎక్కిస్తున్నా
ఈ కళ్ళింకా భ్రమ పడుతున్నాయ్ వ్యాధి
తగ్గించే వ్యాక్సిన్ అని .