20131015

naneelu

కొండ శిలువలున్నై
శిలువలు మోసే 
కష్ట జీవుల సుఖాలు 
మింగేందుకు 


                                                     దేశ వనిత వక్షోజాలపై 
                                                     చూపు దించి ,
                                                     మాడిపోయే పేగులను
                                                     లెక్కించు.

గాడిదలై  
నాయకులను మోస్తున్నారు 
అభివృద్ధి 
తీరాలను చేరేందుకు 

                                                      శ్రామికుల 
                                                      రొండ్లన్నీ ముండ్ల దెబ్బలే 
                                                      సమాజ కచ్రాన్ని 
                                                      నడిపించేందుకు 


జలపాతాలు.
కామాందుల
 వృషణాల్లోంచి ,
స్త్రీ మూర్తి కన్నుల్లోంచి.


మురికిని వదిలించెందుకు 
స్నానం.
గబ్బును దాచుకునేందుకే 
స్ప్రేలు .


పాణం లేని ఉరుముల్లో, 
ఊర పిచ్చుకల గోడు 
గోరంతే కదా...
సర్కారోడ ?

వెలుగుతూ వెలుగునిచ్చే 
సూర్యుడా ?
చీకట్లో ఉంటూ వెలుగునిచ్చే 
కార్మికుడా ? గొప్ప...

శేదేది ఒకడు,
నింపుకునేదింకొకడు,
శేదబావి కాదు ,
బొగ్గు బాయి .

పవలించేందుకు 
సిద్దం చేసిన్లు 
నా దేశాన్ని,
విదేశీ పెట్టుబడికి.

పూలల్లో పూలై 
ప్రవహిస్తున్లు 
మా అవ్వలు 
నిండు బతుకమ్మలై 

పెద్ద బతుకమ్మ
బరువెక్కింది.
బానిస బతుకులు 
మోయలేక.

నింగి కేగసిన 
తారలు.
ఉపగ్రహం,
పొలం లో రైతన్న. 

కోపెన్ హెగెన్, 
బయో డైవర్సిటి 
సదస్సులన్నీ, 
మా ఊరి చెట్లతీర్థాలే.

కాలిన 
దేహాలన్నీ 
బతుకమ్మల మీద 
క్రాంతి కాంతులీనుతున్నై.

వీర వనితలు 
పసుపులద్దుకుని 
కూసున్నరు, 
గౌరమ్మలై .

సీత జడ పూల 
చిక్కదనం,
పారిన రక్తపుటేర్ల 
చిహ్నమే .

స్వదేశీ ప్రేమే
ప్రాంతీయ వాదం.
విదేశీ దోపిడెపుడు
సమైఖ్య గానమే.

పూల వనం మీద
కోయిల గుంపు
వాలినట్టుంది.
బతుకమ్మ జాతర లో.

బతుకమ్మ
ఎదిగిన తాంబూలం
శిశుపాలుని వధకు,
సిద్ధంగా ఉంది.

ఒక పూటే కూడుకు,
మరో పూట కూడళ్ళకు ,
పుటల్లేని
నిరుద్యోగి .

సమైఖ్యం లో
బందీ ఐన
పిచ్చుకలు
నింగి కెగిరే వేళయ్యింది.

కష్టాల పొరకల్ని
కడుపులో దాస్కోని
నవ్వడమే
బతుకమ్మ.

కుంభ కోణపు
మెరుపుల్లో
దిగుడు దీపపు
కాంతులెవడు దేకును.

ప్రపంచమొక రక్తవర్ణచిత్రం
కార్మిక గుండెలు
రంగులు
చిందిస్తున్నై కామ్రేడ్

బానిసత్వపు
కొసన  పూసిన
ఓ మందారమా ...!
నువ్వు వికసించేదెన్నడో ?

శోభల్లేని
బాధా తప్త
నగర మెట్లాయేరా
అశోబాద ?

నా పట్నాన్ని
సాని కొంప జేసి
సంస్కారం అంటున్రు,
స్వార్ధాంద్రులు .

కంసాంద్రులకు
క్యాబినెట్ ఆమోదమొక
ఆకాశ వాణి
హెచ్చరిక.

కమ్మరి కొలిమిల
సరిసిన సబ్బల్లు,
ఒగ్గు
కళాకారులు.

దేశం కోసం
బాడర్లో జవాన్లు,
ప్రజల కోసం
జంగల్లో జవాన్లు.

సేల్లెల్లారా
సందమామలే
సలికాలానికి
దుప్పెట్లవుతున్నాయా ?


ఓ కపటాంధ్రుడా
ప్రాంతాలు ప్రజలకే గానీ,
పారే
నదులకు కాదురా ...

అమరుల రక్తం తో
నిండిన ఒక తార
సంధ్యాకాశం లో
వేలాడుతుంది సూర్యునిలా...

ఆకాశపు
హరివిల్లుల పట్నం లో
లేనిదొక్కటే
ప్రేమ ...

No comments:

Post a Comment